Pak Election : పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాలు విడుదల

Pak Election : పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాలు విడుదల
మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ.. మిత్రపక్షాలకు అత్యధికం

పాకిస్థాన్‌ సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాలను ఆ దేశ ఎన్నికల సంఘం వెల్లడించింది. పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 స్థానాలు ఉండగా రిజర్వ్‌డ్‌ స్థానాలు పోను 265 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఒక స్థానంలో అభ్యర్థి మరణించగా 264 స్థానాలకు పోలింగ్‌ నిర్వహించారు. వీటిలో పలు కేసుల్లో దోషిగా తేలి జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన తెహ్రీక్‌ ఎ ఇన్సాఫ్‌ PTI పార్టీ మద్దతుదారులకు అత్యధికంగా 101 స్థానాలు దక్కాయి. ఇమ్రాన్‌ పార్టీ గుర్తును ఈసీ రద్దు చేయడంతో వీరంతా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి నెగ్గారు. వీరంతా ఇమ్రాన్‌కే మద్దతు తెలిపారు.


పాకిస్తాన్‌ను 3 పర్యాయాలు ఏలిన మాజీ ప్రధాని నవాజ్‌షరీఫ్‌కు చెందిన పాకిస్థాన్‌ ముస్లీం లీగ్‌ నవాజ్‌ పార్టీకి ఓటర్లు 75 స్థానాలను కట్టబెట్టారు. ఫలితంగా పార్లమెంట్‌లో సాంకేతికంగా అతిపెద్ద పార్టీగా.. పాకిస్థాన్‌ ముస్లీం లీగ్‌ నవాజ్‌ అవతరించింది. మరో మాజీ ప్రధాని దివంగత బేనజీర్‌ భుట్టో కుమారుడు బిలావాల్‌ జర్దారీ భుట్టో నేతృత్వంలోని పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ.. 54 సీట్లు సాధించింది. కరాచీలో విస్తరించిన.. ఉర్దూ ప్రాబల్యం అధికంగా ఉండే ముత్తాహిదా క్వామీ మూమెంట్‌ పాకిస్థాన్‌ పార్టీకి 17, మరో 12 స్థానాల్లో ఇతర చిన్న పార్టీలు విజయం సాధించాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 133 సీట్లు అవసరం కాగా.. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. ఫలితాల వెల్లడికి ముందు ప్రక్రియ ఆలస్యంగా జరగడంతో పాకిస్థాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పలు రాజకీయ పార్టీలు తీవ్ర నిరసనలు తెలియజేశాయి.

నవాజ్‌ షరీఫ్‌, బిలావాల్‌ జర్దారీ భుట్టో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఆ రెండు పార్టీలు కలిసినా.. ప్రభుత్వ ఏర్పాటుకు మరో 6 సీట్లు అవసరం అవుతాయి. మరోవైపు.. ప్రభుత్వ ఏర్పాటులో సైన్యం జోక్యం చేసుకుంటుందన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. నవాజ్‌ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా సైన్యాధ్యక్షుడు జనరల్‌ ఆసీమ్‌ మునీర్‌ పావులు కదుపుతున్నట్లు సమాచారం. దేశంలో ప్రజాస్వామ్య శక్తులన్నీ కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆయన ఇప్పటికే పిలుపునిచ్చారు. అవినీతి ఆరోపణల్లో శిక్ష పడి.. బెయిల్‌పై లండన్‌ పారిపోయిన షరీఫ్‌ సరిగ్గా ఎన్నికల ముందు స్వదేశానికి రావడం వెనుకా.. సైన్యం హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి.

Tags

Next Story