Pakistan Election Results : పాక్​ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు

Pakistan Election Results :  పాక్​ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు
ఆధిక్యంలో ఇమ్రాన్​ ఖాన్​ పార్టీ

పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అంచనాలకు పూర్తి భిన్నంగా వెలువడుతున్నాయి. విశ్లేషకుల అంచనాలకు ఏమాత్రం అందని విధంగా మాజీ ప్రధాని, తెహ్రిక్ -ఇ-ఇన్సాఫ్ -PTI అధినేత ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు విజయపథంలో సాగుతున్నట్లు సమాచారం. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ 265 స్థానాలకు గురువారం పోలింగ్ జరగ్గా ఇప్పటివరకు 20 స్థానాల ఫలితాలు ప్రకటించారు. అందులో 10చోట్ల ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు గెలుపొందారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలోని PML(N) పార్టీ ఐదు స్థానాల్లో, మరో ఐదుచోట్ల పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. లాహోర్ లో నవాజ్ షరీఫ్ కూడా గెలుపొందినట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన బ్యాట్ గుర్తును ఎన్నికల సంఘం రద్దు చేయటంతో...వారంతా స్వతంత్రులుగా పోటీ చేశారు. పోలింగ్ ముగిసిన 10గంటల తర్వాత తొలి ఫలితం వెల్లడించటంపై ఇమ్రాన్ ఖాన్ పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం ఫలితాలను తారుమారు చేస్తోందని ఆరోపించారు. 133 స్థానాలు గెలుపొందిన పార్టీ అధికారం చేపట్టనుండగా … తాము 150స్థానాల్లో గెలుపొందినట్లు ఇమ్రాన్ ఖాన్ పార్టీ నేతలు ప్రకటించారు.

పాక్ ఎన్నికల కమిషన్ శుక్రవారం తెల్లవారు జామున 3 గంటలకు తొలి ఫలితాన్ని విడుదల చేసింది. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ మద్దతిస్తున్న పలువురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందినట్టు వెల్లడించింది. ఖైబర్ పాంఖ్తుంక్వా ప్రావిన్స్‌లోని పీకే-76, పీకే-6 తోపాటు స్వాట్‌లోని పీకే-4 స్థానంలో పీటీఐ మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందినట్టు పేర్కొంది. ఆ తరువాత ఫలితాల విడుదల నిలిచిపోవడంతో తమ గెలుపును అడ్డుకుంటున్నారని పీటీఐ ఆరోపించింది.

కాగా, పీటీఐ ఆరోపణలను పాక్ ఎన్నికల సంఘం ప్రత్యేక కార్యదర్శి జాఫర్ ఇక్బాల్ ఖండించారు. ఓట్ల లెక్కింపులో ఆలస్యం వల్లే ఫలితాల విడుదలలో జాప్యం జరుగుతోందన్నారు. మీడియాలోని ఈసీ వ్యతిరేక కథనాలను తోసిపుచ్చారు. శుక్రవారం ఉదయానికి ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తాము 150 స్థానాల్లో గెలిచినట్టు పీటీఐ చైర్మన్ గోహార్ ఖాన్ ప్రకటించుకున్నారు. పంజాబ్, ఖైబర్ పాంఖ్తూంక్వాలో తాము ప్రభుత్వం ఏర్పాటు చేయగలమని చెప్పారు. త్వరగా ఫలితాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

మరోపక్క, పాక్ ఆర్మీ మద్దతున్న పీఎంఎల్-ఎన్ అధినేత నవాజ్ షరీఫ్ ఓడినట్టు ఓ ప్రముఖ వార్తా సంస్థ పేర్కొంది. నవాజ్ పార్టీకి చెందిన ఓ వ్యక్తి ఈ సమాచారం ఇచ్చినట్టు వెల్లడించింది. ఓటమి విషయం తెలిసి నవాజ్, తన కూతురు మరియం, సోదరుడు షెహబాజ్‌తో కలిసి కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లిపోయినట్టు పేర్కొంది.


Tags

Read MoreRead Less
Next Story