Pakistan: పాక్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌.. ఇంటర్నెట్‌ సేవలపై ఆంక్షలు..

Pakistan: పాక్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌.. ఇంటర్నెట్‌ సేవలపై ఆంక్షలు..
జైలు నుంచి పోస్ట‌ల్ బ్యాలెట్ ద్వారా ఓటేసిన ఇమ్రాన్ ఖాన్‌

పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్నది. దేశవ్యాప్తంగా 90వేల పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతుండగా.. ఓటింగ్‌ పూర్తవ్వగానే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. ఉదయం నుంచే ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లు గుమికూడారు. మొత్తం 12.85 కోట్ల మందికిపైగా ఓటు వేయనున్నారు. జాతీయ అసెంబ్లీకి 5,121 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో 4,807 మంది పురుషులు, 312 మంది మహిళలు, ఇద్దరు ట్రాన్స్‌ జెండర్లు ఉన్నారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ జరగడానికి దేశవ్యాప్తంగా 6 లక్షల 50 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు.


పాక్ లో ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా మొబైల్‌ ఇంటర్నెట్‌ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు హోంశాఖ అధికార ప్రతినిధి ప్రకటించారు. అయితే, పాకిస్థాన్‌ టెలికమ్యూనికేషన్‌ అథారిటీ మాత్రం దీన్ని తోసిపుచ్చింది. ఆంక్షలు విధించాలని ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలిపింది. ఈ సేవలు యథాతథంగా కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది. కానీ, కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంటర్నెట్‌ సర్వీసుల్లో అంతరాయం ఏర్పడినట్లు సమాచారం.

మాజీ ప్రధాని, పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఈ-ఇన్సాఫ్‌ (పీటీఐ) అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌, ఇటీవలే లండన్‌ నుంచి వచ్చిన మరో మాజీ ప్రధాని, పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్‌) పార్టీ నేత నవాజ్‌ షరీఫ్‌ ఈ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ పడుతున్నారు. తన పార్టీ ఎన్నికల చిహ్నమైన క్రికెట్‌ బ్యాట్‌ను ఎన్నికల సంఘం తొలగించడంతో ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని పీటీఐ అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. అయితే సైన్యం మద్దతు పుష్కలంగా ఉన్న మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ మరోసారి అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే 74 ఏండ్ల షరీఫ్‌ రికార్డు స్థాయిలో నాలుగోసారి పాక్‌ ప్రధానిగా కానున్నారు.


పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌ త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. జైలు నుంచే ఆయ‌న పోస్ట‌ల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. జైలుశిక్ష అనుభ‌విస్తున్న మ‌రికొంత మంది రాజ‌కీయ నాయ‌కులు కూడా ఇవాళ జ‌రుగుతున్న పోలింగ్‌లో త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ మాత్రం ఓటు హ‌క్కును వాడుకోలేదు. ఎందుకంటే పోస్ట‌ల్ ఓటింగ్ ప్ర‌క్రియ ముగిసిన త‌ర్వాత ఆమెను అరెస్టు చేయ‌డం వ‌ల్ల ఓటు వేయ‌లేని ప‌రిస్థితి వ‌చ్చింది. మెయిల్ ద్వారా ఓటేసిన నేత‌ల్లో మాజీ విదేశాంగ మంత్రి షా మ‌హ‌మూద్ ఖురేషి, మాజీ పంజాబ్ సీఎం చౌద‌రీ ప‌ర్వేజ్ ఇలాహి, అవామీ ముస్లిం లీగ్ చీఫ్ షేక్ ర‌షీద్‌, మాజీ సమాచార‌శాఖ మంత్రి ఫ‌హ‌ద్ చౌద‌రీ ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story