Pakistan: పాకిస్థాన్‌లో . లష్కరే, హమాస్ నాయకుల భేటీ

ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తున్న దేశంగా ఇప్పటికే పేరు తెచ్చుకున్న పాకిస్థాన్‌లో తాజాగా మరో ఆందోళనకర పరిణామం వెలుగులోకి వచ్చింది. హమాస్, లష్కరే తోయిబా ఉగ్రవాద నేతలు ఒకే వేదికగా సమావేశమైన విషయం బట్టబయలైంది. ఈ ఘటన పాకిస్థాన్‌లోని గుజ్రాన్‌వాలాలో జరిగింది. అక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమంలో హమాస్ సీనియర్ కమాండర్ నాజీ జహీర్, లష్కరే తోయిబా కమాండర్ రషీద్ అలీ సందూహ్‌తో కలిసి పాల్గొన్నాడు. ఈ కార్యక్రమాన్ని పాకిస్థాన్ మార్కజీ ముస్లిం లీగ్ నిర్వహించింది. ఈ పార్టీ లష్కరే తోయిబాకు రాజకీయంగా ప్రోత్సాహం అందిస్తోందని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ వీడియోలో నాజీ జహీర్ ముఖ్య అతిథిగా హాజరైనట్లు, రషీద్ సందూహ్ పార్టీ నేతగా ఉన్నట్లు కనిపించింది. కానీ వాస్తవానికి సందూహ్ లష్కరే తోయిబాకు చెందిన కీలక కమాండర్. ఈ సమావేశం అమెరికా నిషేధించిన రెండు ఉగ్రవాద సంస్థల మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయని స్పష్టంగా చూపుతోంది. నాజీ జహీర్ పాకిస్థాన్‌తో సంబంధాలు కొత్తవి కావు. 2025 ఫిబ్రవరిలో అతడు ఇతర హమాస్ నేతలతో కలిసి పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌కు వెళ్లాడు. ఆ పర్యటనలో లష్కరే తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్ నేతలతో కలిసి భారత్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన సభలో ప్రసంగించాడు. ఆ పర్యటన జరిగిన కొన్ని వారాలకే పహల్గాం ఉగ్రదాడి జరగడం గమనార్హం.
అంతకుముందు 2024 జనవరిలో కరాచీకి వెళ్లిన జహీర్, అక్కడ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడాడు. అదే ఏడాది ఏప్రిల్‌లో ఇస్లామాబాద్‌కు వెళ్లి హైకోర్టు బార్ అసోసియేషన్ నుంచి సత్కారం పొందాడు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన దాడి తర్వాత వారం రోజుల్లోనే అతడు పాకిస్థాన్‌కు వచ్చి, జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం అధినేత మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్‌ను కలిశాడు. అదే రోజు పేశావర్‌లో జరిగిన ముఫ్తీ మహ్మూద్ సమావేశంలో ప్రసంగించాడు. ఆ సమావేశంలో హమాస్ మరో నేత ఖాలెద్ మషాల్ పాల్గొన్నాడు. తర్వాత అక్టోబర్ 29న బలోచిస్థాన్‌లోని క్వెట్టాలో నిర్వహించిన ‘అల్ అక్సా స్టార్మ్’ సమావేశంలో జహీర్ పాల్గొన్నాడు. నవంబర్ 2023లో కరాచీలో జరిగిన ‘తూఫాన్-ఎ-అక్సా’ సమావేశంలోనూ కనిపించాడు. ఈ వరుస పర్యటనలు, సమావేశాలు, పాకిస్థాన్‌లో హమాస్ నేతలకు లభిస్తున్న బహిరంగ మద్దతు ఉగ్రవాద సంస్థలతో పెరుగుతున్న సమన్వయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

