Pakistan: పీఓకే మనది కాదు విదేశీ భూభాగమే..

Pakistan: పీఓకే మనది కాదు విదేశీ భూభాగమే..
X
ఒప్పుకున్న పాకిస్థాన్ గవర్నమెంట్

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే) విదేశీ భూభాగమని పాకిస్థాన్‌ ఒప్పుకున్నది. పీవోకే తమ అధికార పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇస్లామాబాద్‌ హైకోర్టుకు వెల్లడించింది. మే 15న కశ్మీరీ కవి, జర్నలిస్ట్‌ అహ్మద్‌ ఫర్హద్‌ షాను పాకిస్థాన్‌ ఇంటిలెజెన్స్‌ సంస్థలు రావల్సిండిలోని తన ఇంటి నుంచి కిడ్నాప్‌ చేశాయి. ఆయన పీవోకే ప్రజల హక్కుల పరిరక్షణకు, పాక్‌ మిలిటరీకి వ్యతిరేకంగా పోరాడుతుంటారు. దీంతో తన భర్త ఆచూకీని తెలపాలని కోరుతూ ఆయన భార్య ఇస్లామాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ మొహ్సిన్‌ అఖ్తర్‌ కయానీ.. ఫర్హద్‌ షాను కోర్టులో హాజరుపరచాల్సిందిగా ఆదేశించారు. అయితే, ఫర్హద్‌ ప్రస్తుతం పీవోకేలో పోలీస్‌ కస్టడీలో ఉన్నాడని, కాబట్టి అతడిని ఇస్లామాబాద్‌ హైకోర్టులో తాము ప్రవేశపెట్టలేమని శుక్రవారం పాకిస్థాన్‌ అడిషనల్‌ అటార్నీ జనరల్‌.. కోర్టుకు తెలియజేశారు. కశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం, సొంత కోర్టులు ఉన్నాయని, పాకిస్థాన్‌ కోర్టులు ఇచ్చే తీర్పులు విదేశీ కోర్టులు ఇచ్చినట్టుగానే పీవోకేలో కనిపిస్తాయని తెలిపారు. దీనిపై జస్టిస్‌ మొహ్సిన్‌ అఖ్తర్‌ కయానీ స్పందిస్తూ… పీవోకే విదేశీ భూభాగం అయితే పాకిస్థానీ మిలిటరీ, రేంజర్లు ఆ భూభాగంలోకి ఎలా అడుగుపెట్టారని ప్రశ్నించారు.

సామన్యులను విచారణ పేరుతో ఇంటెలిజెన్స్‌ సంస్థలు బలవంతంగా నిర్బంధించడాన్ని తప్పని స్పష్టం చేసారు. మరోవైపు పాక్‌ న్యాయవాది వ్యాఖ్యలతో భారత్‌కు మరింత బలం చేకూరినట్లయింది. ‘పీవోకే’ భారత్‌లో అంతర్భాగమని, అది 1947 నుంచి పాక్‌ ఆక్రమణలో ఉందని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ పలు మార్లు చెప్పారు. పీవోకే ఎప్పటికీ భారత్‌తోనే ఉంటుందని, అది భారత్‌లోనే ఉంటుందని వివిధ సందర్భాల్లో ఆయన స్పష్టం చేశారు.

Tags

Next Story