Pakistan: పాక్ లో పెరిగిన పెట్రోల్ ధరలు

Pakistan: పాక్ లో పెరిగిన పెట్రోల్ ధరలు
లీటర్‌కు రూ.20 చొప్పున ఇంధన ధరలు పెంచిన పాకిస్థాన్

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్.ఆదాయం కోసం ప్రజలపైనే భారం వేసింది. పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచేసింది. ఏకంగా లీటర్‌కు రూ.20 చొప్పున ఇంధన ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జాతి ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని పాక్ ప్రకటించింది.

పాకిస్తాన్లో పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌పై 19 రూపాయలు పెంచుతున్నట్లు ఆ దేశ ఆర్థిక మంత్రి ఇషాక్ దర్ స్వయంగా వెల్లడించారు.తాజాగా పెంచిన ఈ పెంపుతో పాకిస్థాన్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.272.95కి చేరగా, లీటర్ డీజిల్ ధర రూ.273.40కు ఎగబాకింది.


దివాలా అంచున ఉన్న పాకిస్థాన్.. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఎక్కడికక్కడ అప్పులు చేస్తోంది. ఓ వైపు చైనా నుంచి సహాయం తీసుకుంటూనే మరోవైపు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి బెయిలవుట్ ప్యాకేజీ కోసం చేతులు చాస్తోంది. అయితే పాకిస్థాన్‌కు 3 బిలియన్ డాలర్ల బెయిలవుట్ ప్యాకేజీ ఇవ్వడం కోసం ఐఎంఎఫ్ అనేక నిబంధనలు విధిస్తోంది. అందులో భాగంగా.. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ఇంధన ధరలను పెంచాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే పాక్ లో పెట్రోల్ బంగారం అయిపోయింది. గత 15 రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ఇంధనలు గణనీయంగా పెరిగాయని పాక్ ఆర్థిక మంత్రి తెలిపారు. కానీ అంత మేర పెంచకుండా.. సాధ్యమైనంత తక్కువగానే ధరలు పెంచామని తెలిపారు.

ఒక్క పెట్రోల్, డీజిల్ ధరలే కాదు పాకిస్థాన్‌లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం కారణంగా ఆహార పదార్థాల ధరలు కూడా పతాక స్థాయికి చేరాయి. పాకిస్తాన్ లో ప్రజల ప్రధాన ఆహారం గోధుమలు. తమకు అవసరమైన గోధుమలను పాకిస్థానీలే పండించుకుంటారు. మిగిలినదాన్ని ఎగుమతి కూడా చేస్తారు. కానీ.. గత ఏడాది పాకిస్థాన్‌ను ముంచెత్తిన వరదల దెబ్బకు లక్షలాది ఎకరాల్లో పంటలన్నీ నీటమునిగిపోయాయి. ఏడాది పొడుగునా వాడుకోవడం కోసం రైతులు ఇళ్లల్లో దాచుకున్న గోధుమలు కూడా తడిసి ముద్దయిపోయాయి. దీంతో నిన్నమొన్నటి దాకా రూ.20 ఉండే కిలో గోధుమ పిండి ధర రూ.140 నుంచి రూ.160కి చేరింది.

పెరిగిన నిత్యావసరాల ధరలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఇంధన ధరలు కూడా పెరగడంతో.. వారి కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story