Pakistan Mosque Blast: 100కు చేరిన మృతుల సంఖ్య

ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ ఉగ్రదాడితో ఉలిక్కిపడింది. పెషావర్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకూ మృతుల సంఖ్య 100 కి చేరుకుంది. శిథిలాలను తొలగిస్తుంటే ఇంకా మృతదేహాలు బయట పడుతూనే ఉన్నాయి. ఎవ్వరూ కూడా ప్రాణాలతో దక్కే చాన్స్ లేకుండా పోయింది. మరోవైపు 200 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వారంతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పెషావర్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పోలీస్ లైన్స్‌లోని ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. దాదాపు 20 మంది పోలీసు అధికారులు, భద్రతా సిబ్బంది ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. వారికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రముఠా నుంచి ప్రకటన వెలువడలేదు. 'పాకిస్థాన్ పరిరక్షణ కోసం పాటుపడుతోన్న వారిని లక్ష్యంగా చేసుకొని, ఉగ్రవాదులు భయాన్నిసృష్టించాలని అనుకుంటున్నారు' అని ప్రధాని షహబాజ్ షరీఫ్ మండిపడ్డారు. సోమవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)అధ్యక్షుడు పాకిస్థాన్‌లో పర్యటించాల్సి ఉంది. ఆ సమయంలోనే ఈ ఉగ్రదాడి జరిగింది. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ఆ పర్యటన కాస్తా రద్దయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com