Pakistan: నెలరోజుల్లో దేశం వదిలి పొండి....

Pakistan: నెలరోజుల్లో దేశం వదిలి పొండి....
17 లక్షల మంది ఆఫ్గన్లకు పాక్ హెచ్చరికలు..

పాకిస్తాన్ దేశంలో ఉగ్రవాద దాడులు ఒక్కసారిగా పెరిగాయి. ఇటీవల బలూచిస్తాన్ ప్రాంతంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 57 మంది మరణించారు. ఈ దాడులకు ఆఫ్ఘాన్ జాతీయులు కారణం కావచ్చని పాకిస్తాన్ నమ్ముతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లో తలదాచుకుంటున్న ఆఫ్ఘన్ పౌరులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. నవంబర్ 1లోగా తమ దేశంలో ఉన్న 17 లక్షల మంది ఆఫ్ఘాన్లు పాకిస్తాస్ వదిలి వెళ్లాలని హుకూం జారీ చేసింది.

ఆఫ్గనిస్థాన్‌లో తాలిబన్లు పాగా వేయడంతో అక్కడ ఉన్నవారికే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న ఆఫ్గాన్ వాసులకు కష్టాలు తప్పడం లేదు. ప్రజలకు మంచి పాలన అందిస్తామని చెప్పి.. ఆఫ్గాన్ భూభాగాన్ని సొంతం చేసుకున్న తాలిబన్లు గత పాలన లాగే అరాచకాలు, కఠినమైన శిక్షలు విధిస్తున్నారు. దీనికి తోడు ఆఫ్గనిస్థాన్‌లో ప్రజల జీవన ప్రమాణాలు రోజు రోజుకూ పడిపోతుండటంతో ఎంతోమంది పొరుగు దేశాలకు వలస వెళ్లారు. అయితే గత కొంత కాలంగా ఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్ మధ్య తీవ్ర సరిహద్దు ఘర్షణలు, బాంబు పేలుళ్లు చోటు చేసుకుంటుండటంతో పాక్ కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమంగా పాక్‌లో బతుకుతున్న ఆఫ్గాన్ వాసులు వెంటనే స్వదేశానికి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేసింది. నవంబర్‌లోగా పాక్ భూభాగాన్ని విడిచి వెళ్లాలని ఆఫ్గాన్ ప్రజలకు పాక్ ప్రభుత్వం అల్టిమేటం ఇచ్చింది.


ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం 13 లక్షల మంది ఆఫ్ఘాన్ పౌరులు ఇప్పటికే శరణార్థులుగా రిజిస్టర్ చేయించుకోగా.. మరో 8.8 లక్షల మంది శరణార్థులుగా ధ్రువీకరణ పత్రాలు పొందారు. వీరితో పాటు మరో 17 లక్షల మంది అక్రమంగా పాకిస్తాన్ లోకి చొరబడ్డారని పాక్ అంతర్గత మంత్రి సర్ఫరాజ్ బుగిటి ఇటీవల తెలిపారు. వీరంతా వెళ్లిపోవాలని, లేకపోతే బలవంతంగా బహిష్కరిస్తామని, నవంబర్ తర్వాత పాస్ పోర్టు, వీసా లేకుంటే ఎవర్నీ దేశంలోకి అనుమతించమని అన్నారు. పాకిస్తాన్ దేశంలో వరసగా జరుగుతున్న ఉగ్రవాద దాడుల్లో ఆఫ్ఘాన్ పౌరులలే ఉంటున్నారని , ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు పాక్ లో మొత్తం 24 ఆత్మాహుతి దాడులు జరిగితే. అందులో 14 మంది ఆఫ్ఘన్ పౌరులే ఉన్నారని పాక్ చెబుతోంది.

అయితే పాక్ తీసుకున్న ఈ నిర్ణయం ఆమోదయోగ్యం కాదని తాలిబాన్ సర్కార్ అభిప్రాయ పడుతోంది. కాబూల్ లోని తాలిబాన్ పరిపాలన ప్రతినిధి మాట్లాడుతూ.. పాకిస్తాన్ భద్రతా సమస్యలకు ఆఫ్ఘన్లు కారణం కాదని అన్నారు. పాకిస్తాన్ ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని, వారు స్వచ్ఛందంగా పాకిస్తాన్ విడిచిపెట్టేంత కాలం ఆ దేశంలోనే ఉండనివ్వాలన్నారు.

Tags

Read MoreRead Less
Next Story