Pakistan: ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాకిస్థాన్ ప్రజల నిరసనలు. చివరికి మృత్యువాత..

Pakistan (tv5news.in)

Pakistan (tv5news.in)

Pakistan: పాకిస్థాన్‌ ప్రభుత్వంపై ఆ దేశ ప్రజలు భగ్గుమంటున్నారు.

Pakistan: పాకిస్థాన్‌ ప్రభుత్వంపై ఆ దేశ ప్రజలు భగ్గుమంటున్నారు. నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోవడంతో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా భారీ స్థాయిలో నిరసనలు, ర్యాలీలు చేపడుతున్నారు. ప్రజాందోళనలతో పాకిస్థాన్ అట్టుడుకుతోంది. దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాడంటూ ఇమ్రాన్‌ ఖాన్‌ పనితీరుపై ప్రతిపక్షాలు, కార్మికులు, ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.

నిత్యావసరాలు, గ్యాస్‌, విద్యుత్తు ధరలు భారీగా పెరిగాయని.. ప్రధాని తక్షణమే రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. పెరిగిపోయిన ధరలతో పేదలకు రోజుకు కనీసం రెండు పూటలు కూడా భోజనం లభించడంలేదని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని పదవికి ఇమ్రాన్‌ అనర్హుడని జమీయత్‌ ఉలేమా-ఇ-ఇస్లాం సంస్థ నేత రషీద్‌ సుమ్రో వ్యాఖ్యానించారు.

దేశాన్ని ఎలా నడపాలో ఇమ్రాన్‌కు తెలియదని.. ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. లాహోర్‌లో ప్రజలు, భద్రతా దళాల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో పోలీసులు నిరసనకారులపై కాల్పులు జరపగా.. ఇద్దరు మృతిచెందారు. అనేకమంది గాయపడ్డారు. గతేడాది ఫ్రాన్స్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో అరెస్టు చేసిన తమ నేతను విడుదల చేయాలన్న డిమాండ్‌తో నిరసనకారులు ఇస్లామాబాద్‌కు లాంగ్‌మార్చ్‌ నిర్వహిస్తున్నారు.

కాగా లాహోర్‌ నుంచి రాజధాని ఇస్లామాబాద్‌ వెళుతున్నవారిని భద్రతా దళాలు అడ్డుకోవడంతో ఘర్షణ చెలరేగింది. ఆందోళనకారులపై పోలీసులు బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించేందుకు కూడా పోలీసులు అనుమతించకపోవడంతో నిరసనకారులు దాడికి దిగారు. ఈ దాడుల్లో ఇద్దరు పోలీసు అధికారులు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. నిరసనకారులు ఇస్లామాబాద్‌లో ప్రవేశించకుండా ఉండేందుకు రహదారులను దిగ్బంధించారు.

Tags

Next Story