Pak train hijack: హైజాకర్ల కాల్చివేత.. బందీల విముక్తి

Pak train hijack: హైజాకర్ల కాల్చివేత.. బందీల విముక్తి
X
200 శవపేటికలను క్వెట్టాకు తరలించిన పాక్ ప్రభుత్వం..

రైలును హైజాక్‌ చేసి వందల మంది ప్రయాణికులను బందీలుగా చేసుకున్న వేర్పాటువాద తీవ్రవాదులందరినీ చంపివేసినట్టు పాకిస్థాన్‌ సైన్యం బుధవారం ప్రకటించింది. సైనిక ఆపరేషన్‌ అనంతరం బందీలందరికీ విముక్తి కల్పించినట్లు తెలిపింది. తీవ్రవాదుల కాల్పులలో 21 మంది ప్రయాణికులు, నలుగురు పారామిలిటరీ సిబ్బంది మరణించారని సైనిక ప్రతినిధి ఒకరు తెలిపారు. ఘటనా స్థలి వద్ద ఉన్న 33 మంది తీవ్రవాదులను భద్రతా దళాలు చంపివేశాయని, 346 మంది బందీలకు విముక్తి కల్పించినట్టు తెలిపారు.

అంతకుముందు పాక్‌ సర్కారుకు వేర్పాటువాద గ్రూపు బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ(బీఎల్‌ఏ) అల్టిమేటం జారీచేసింది. తమపై పాకిస్థాన్‌ సైనిక దాడికి ప్రతీకారంగా 50 మంది బందీలను చంపివేసినట్టు ప్రకటించింది. సైనిక ఆపరేషన్‌ను నిలిపివేసి బలూచ్‌ ఖైదీలను విడుదల చేస్తున్నట్టు ప్రకటించేందుకు పాకిస్థాన్‌ ప్రభుత్వానికి మరో 20 గంటలు మాత్రమే గడువు ఉందని హెచ్చరించింది. పాకిస్థాన్‌ ప్రభుత్వం స్పందించని పక్షంలో తమ వద్ద బందీలుగా ఉన్న వారినందరినీ చంపివేస్తామని వేర్పాటువాదులు హెచ్చరించారు. మంగళవారం రాత్రి పాకిస్థాన్‌ జరిపిన డ్రోన్‌ దాడికి సమాధానంగా 10 మంది భద్రతా సిబ్బందిని చంపివేసినట్టు వేర్పాటువాదులు ప్రకటించారు. బుధవారం జరిగిన కాల్పుల పోరులో మరో 10 మంది సైనికులు మరణించారని, మొత్తంగా హైజాక్‌ జరిగినప్పటి నుంచి మొదలైన పోరులో 100 మందికి పైగా సైనిక సిబ్బంది మరణించారని వేర్పాటువాదులు తెలిపారు. తమ అధీనంలో 150 మందికి పైగా బందీలుగా ఉన్నారని బుధవారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో బీఎల్‌ఏ తెలిపింది.

ఇదిలా ఉంటే, పాకిస్తాన్‌లో పరిస్థితులు మాత్రమే వేరేలా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాక్ ఆర్మీ వైపు నుంచి కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పాకిస్తాన్ ప్రభుత్వం క్వెట్టాకు 200కి పైగా శవపేటికల్ని తరలించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బోలాన్ నుంచి వీటిని క్వెట్టాకు తరలించినట్లు పాక్ రైల్వే అధికారులు ధ్రువీకరించారు. హైజాక్ జరిగి ఒక రోజు గడిచిన పాక్ ఆర్మీ ఇప్పటి వరకు ఆపరేషన్ ముగించలేకపోయింది. అయితే, ఈ శవపేటికల్ని ప్రోటోకాల్ కింద పంపినట్లు, తద్వారా ప్రతికూల పరిస్థితులు ఎదురైతే ఉపయోగించుకోవచ్చని పాక్ చెబుతోంది. నిజానికి, ఇప్పటికే వందలాది మంది సైనికులను బీఎల్ఏ చంపేసినట్లు అక్కడి సోషల్ మీడియాలో నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

9 బోగీలలో దాదాపు 500 మంది ప్రయాణికులతో క్వెట్టా నుంచి పేషావర్‌ వెళుతున్న జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ను సాయుధ తీవ్రవాదులు మంగళవారం మధ్యాహ్నం బోలన్‌ ప్రాంతంలోని గుడాలర్‌, పీరు కున్నీ పర్వత శ్రేణుల సమీపాన రైల్వే ట్రాకు పేల్చివేసి సొరంగంలో నిలిపివేశారు. ప్రయాణికులను బందీలుగా చేసుకున్నారు. జైలులో ఉన్న తీవ్రవాదులను విడిచిపెట్టడానికి ప్రభుత్వం అంగీకరిస్తే బందీలను విడుదల చేయడానికి తమకు అభ్యంతరం లేదని అంతకుముందు బీఎల్‌ఏ ప్రతినిధి జీయాండ్‌ బలోచ్‌ తెలిపారు. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఆత్మాహుతి జాకెట్లు ధరించిన తీవ్రవాదులు తమ బందీలకు అత్యంత సమీపంలో కూర్చుని ఉన్నారని భద్రతా వర్గాలు వెల్లడించాయి. ఓటమి భయంతో ఉన్న తీవ్రవాదులు అమాయక ప్రయాణికులను మానవ కవచాలుగా అడ్డుపెట్టుకుని తప్పించుకోవాలని ప్రయత్నించే అవకాశం ఉందని,మూడు వేర్వేరు ప్రదేశాలలో మహిళలు, పిల్లలను వారు బందీలుగా చేసుకున్నారని చెప్పాయి.

Tags

Next Story