India- Pakistan: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, అక్కడి పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ (Maryam Nawaz) వేదాలు వల్లించారు. పొరుగున ఉన్నవారితో ఘర్షణ పడొద్దని, స్నేహ హస్తం చాచాలని, హృదయం తలుపులు తెరవాలంటూ శాంతి వచనాలు పలికారు. ఇవి తన తండ్రి మాటలని ఆమె వెల్లడించారు.
‘‘నేను ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పుడు.. పంజాబీ సోదరుల నుంచి శుభాకాంక్షలు అందాయి. నేను పాకిస్థానీని. నేను పంజాబీని కూడా. భారత పంజాబీల్లానే మేం కూడా ఆ భాష మాట్లాడాలనుకుంటున్నాం. మా తాత మియాన్ షరీఫ్.. అమృత్‌సర్‌లోని జాటి ఉమ్రాకు చెందినవారు. ఒక పంజాబీ భారతీయుడు జాటీ ఉమ్రా నుంచి మట్టిని తీసుకువచ్చినప్పుడు దానిని నేను మా తాత సమాధి వద్ద ఉంచాను’’ అని వ్యాఖ్యలు చేశారు. భారత్ నుంచి కర్తార్‌పుర్ సాహిబ్ గురుద్వారాను దర్శించుకోవడానికి వచ్చిన సిక్కులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు.
ఇదిలాఉంటే.. ఫిబ్రవరిలో మరియం పంజాబ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. పాకిస్థాన్ చరిత్రలో ఒక రాష్ట్రానికి మహిళ ముఖ్యమంత్రి కావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఆమె పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. మరోవైపు, పాకిస్థాన్ ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేసేవరకు ఆ దేశంతో చర్చలు ఉండవని భారత్ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. పొరుగు దేశాలతో తాము సత్సంబంధాలు కొనసాగించాలని కోరుకుంటామని, ఎవరైనా అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే మాత్రం ఉపేక్షించమని ఇదివరకు పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com