Pakistan: భారత్‌పై మరోసారి విషం కక్కిన పాక్ రక్షణ మంత్రి..

Pakistan: భారత్‌పై మరోసారి విషం కక్కిన పాక్ రక్షణ మంత్రి..
X
ఆఫ్ఘనిస్తాన్ భారత్‌కు ప్రాక్సీగా మారిందన్న ఖవాజా ఆసిఫ్..

పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కాడు. భారతదేశం పాకిస్తాన్‌పై ద్విముఖ పోరు చేస్తుందని ఆరోపించారు. రెండు సరిహద్దుల్లో యుద్ధం చేయడానికి ఆఫ్ఘనిస్తాన్‌ను భారత్ ప్రాక్సీగా ఉపయోగించుకుంటుందని ఆయన అన్నారు. భారత్ పాకిస్తాన్ తూర్పు, పశ్చిమ సరిహద్దుల్లో బిజీగా ఉందని ఆరోపించారు. ఇటీవల, ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దుల్లో డ్యూరాండ్ లైన్ వద్ద పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణల్లో భారత్ పాత్ర ఉందని పాకిస్తాన్ ఆరోపించింది.

‘‘భారత్ అష్రఫ్ ఘనీ పరిపాలన కాలం నుంచి పాకిస్తాన్‌పై ప్రాక్సీ యుద్ధం చేస్తోంది. దీనికి కావాలంటే మేము రుజువులు కూడా ఇస్తాం. భారత్ పాకిస్తాన్‌ను తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో రెండు వైపులా నిమగ్నమయ్యేలా ఉంచడానికి ప్రయత్నిస్తోంది’’ అని జియో న్యూస్‌తో ఆసిఫ్ అన్నారు. ఇటీవల, ఆఫ్ఘాన్-పాక్ మధ్య కాల్పుల విరమణ త్వరగా కొలిక్కి రాకపోవడానికి భారత్ కారణమని ఖవాజా ఆసిఫ్ ఆరోపించారు.

ఆఫ్ఘనిస్తాన్‌తో ఘర్షణపై మాట్లాడుతూ.. మా వైపు నుంచి ఎలాంటి శత్రుత్వం లేకున్నా ఆఫ్ఘాన్ పదే పదే కాల్పులు ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆరోపించారు. కాబూల్ నుంచి తెహ్రీక్-ఏ-తాలిబాన్‌ పాక్‌పై దాడులకు పాల్పడుతోందని అన్నారు. అయితే, ఈ ఆరోపణల్ని ఆఫ్ఘాన్ ఖండించింది. పాకిస్తాన్ ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ (IS-K) ఉగ్రవాదులకు ఆశ్రయింస్తోందని ఆరోపించింది.

Tags

Next Story