Lahore: ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా లాహోర్..

పాకిస్థాన్‌లోని చారిత్రక నగరం లాహోర్ వాయు కాలుష్యంతో అల్లాడిపోతోంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఇది మొదటి స్థానంలో నిలిచింది. స్విస్ వాయు నాణ్యత సంస్థ 'ఐక్యూఎయిర్' (IQAir) విడుదల చేసిన నివేదిక ప్రకారం లాహోర్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 353గా నమోదైంది. మరో నగరం క్వెట్టాలో ఉదయం ఏక్యూఐ 517గా రికార్డవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇది అత్యంత ప్రమాదకరమైన స్థాయి.
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. పాకిస్థాన్‌లోని పలు నగరాల్లో గాలి పీల్చుకోవడానికి కూడా వీలులేని విధంగా మారింది. రహీమ్ యార్ ఖాన్, గుజ్రన్‌వాలా, ఫైసలాబాద్ వంటి నగరాల్లో గాలి నాణ్యత అనారోగ్యకరమైన స్థాయిలో ఉంది. ఖైబర్ పఖ్తుంఖ్వా, దక్షిణ పంజాబ్‌లోని మైదాన ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేయడంతో హైవేలపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అధికారులు పలు మోటార్‌వేలను మూసివేశారు.
నాణ్యతలేని డీజిల్ వాహనాల పొగ, పంట వ్యర్థాలను తగలబెట్టడం, ఉష్ణోగ్రతలు తగ్గడం వంటి కారణాలతో లాహోర్‌ను తరచూ దట్టమైన పొగమంచు కప్పేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన పరిమితి కంటే 80 రెట్లు అధిక కాలుష్యం ఇక్కడ నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.
వాతావరణ మార్పులపై పరిశోధనలు చేసే అబ్దుల్ వహీద్ భుట్టో 'ది డిప్లొమాట్'లో రాసిన నివేదిక ప్రకారం పాకిస్థాన్ తీవ్రమైన పర్యావరణ, సామాజిక-ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. తగ్గుతున్న అటవీ విస్తీర్ణం, ఆనకట్టల్లో పూడిక, నీటి నిల్వ సామర్థ్యం తగ్గడం, వరదల ముప్పు, నీటి కొరత వంటి సమస్యలతో దేశం సతమతమవుతోంది. రవాణా, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం వల్ల ప్రజలు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ వాతావరణ మార్పుల వల్ల పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్రంగా నష్టపోతోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

