Pakistan : ఇవాళ పాకిస్థాన్ ప్రధాని ఎన్నిక
Pakistan : పాకిస్థాన్‌లో నెల రోజులుగా సాగుతున్న పొలిటికల్ డ్రామాకు ఇవాళ తెరపడనుంది. అవిశ్వాస తీర్మానంతో ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్‌ఖాన్‌ను విపక్షాలు తొలగించిన నేపథ్యంలో కొత్త ప్రధాని ఎంపికకు వీలుగా....ఇవాళ మధ్యాహ్నా రెండు గంటలకు ఆ దేశ నేషనల్ అసెంబ్లీ భేటీ కానుంది. ప్రధాని పదవికి విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ నామినేషన్ దాఖలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ అయిన పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ నుంచి మాజీ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషి నామినేషన్ వేశారు.
పాక్ నేషనల్ అసెంబ్లీలో మొత్తం 342 మంది సభ్యులు ఉండగా..ప్రభుత్వ ఏర్పాటుకు 172 సభ్యుల మద్ధతు అవసరం. అయితే ఇమ్రాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశానికి అనుకూలంగా 174 మంది మద్దతు తెలపడంతో...పాకిస్థాన్ తదుపరి ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ గెలుపు లాంఛనం కానుంది. షెహబాజ్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు సోదరుడు.
మరోవైపు పాక్ నేషనల్ అసెంబ్లీ సమావేశాల నేపథఅయంలో ఆ దేశ ఎయిర్‌పోర్టుల్లో నిఘా పెంచారు. ప్రధాన దర్యాప్తు సంస్థ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఇమ్మిగ్రేషన్ అధికారులు ఎయిర్‌పోర్టుల్లో మొహరించారు. ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు అనుమతి లేకుండా దేశం విడిచివెళ్లొద్దంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇమ్రాన్ మూడో భార్య స్నేహితురాలు ఫరాఖాన్‌పై అవినీతి ఆరోపణలుండగా...భారీగా నగదుతో ఆమె దుబాయి పారిపోయింది.
దీంతో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.అటు ఇమ్రాన్ సహా ఆయన మంత్రి వర్గంలో పని చేసిన సభ్యులు దేశం విడిచి వెళ్లరాదని ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై ఇవాళ విచారణ జరగనుంది. అటు ఇమ్రాన్ ఖాన్ తొలగింపును నిరసిస్తూ ఆయన మద్దతుదారులు దేశంలోని పలు నగరాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com