Paksitan : పాకిస్తాన్‌లో దారుణ పరిస్థితులు.. చిమ్మ చీకట్లో ప్రజలు

Pakistan: పాకిస్థాన్ కష్టాలు అంతా ఇంతా కావు. ఇప్పటికే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తాము భారత్ తో మూడు యుద్దాలు చేసి బుద్ది తెచ్చుకున్నామని, తమ విలువైన వనరులను బాంబులు కొనడానికి వాడామని తెలిపారు. భారత్ తో చేసిన మూడు యుద్దాల వలన, పాకిస్థాన్ లో నిరుద్యోగం, దరిద్రం పెరిగిందని ఆయన అన్నారు.
పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలవడంతో, అక్కడి ప్రజలు తినడానికి తిండి లేక కటకట లాడుతున్నారు. ప్రభుత్వం సరఫరా చేసే పిండిని ఇంటికి తీసుకెళ్లడానికి బ్యాగులు లేక 'షర్ట్' ను బ్యాగుగా మార్చి తీసుకెళ్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో, పిండి సరఫరా చేసే లారీని బైకులతో వెంబడించి దోచుకెళ్తున్నారు.
తాజాగా పాకిస్థాన్ లో భారీ విద్యుత్ అంతరాయం ఏర్పడింది. పాక్ రాజధాని ఇస్లామాబాద్ తోపాటు లాహోర్ లాంటి నగరాలలో కొన్ని గంటలపాటు కరెంటు లేదు. గ్రిడ్ వైఫల్యం కారణంగా పాకిస్థాన్ లో విద్యుత్ అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. నేషనల్ గ్రిడ్ ఫ్రీక్వెన్సీ తగ్గిందని, దీని ఫలితంగా పాకిస్థాన్ అంతటా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని పాక్ ఇంధన మంత్రిత్వ శాఖ ట్వీట్ ద్వారా తెలిపింది.
బలూచిస్తాన్ లోని 22 జిల్లాలతో పాటు, లాహోర్, క్విట్టా, గుడ్డు, కరాచీ, ఇస్లామాబాద్, పెషావర్ నగరాలలో కరెంటు సరఫరా ఆగింది. దక్షిణ పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్ లో ఉన్న పవర్ ప్లాంట్ లో సాంకేతిక లోపం కారణంగా విద్యుత్ ప్రసార వ్యవస్థ యొక్క ఫ్రీక్వెన్సీ సెకను కంటే తక్కువ వ్యవధిలో సరఫరా అయింది. 50 నుంచి 0కు ఆకస్మాత్తుగా తగ్గడం వలన బ్లాక్ ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఈ ఘటన పాకిస్థాన్ లోని అన్ని నగరాలను చీకట్లో ముంచేసింది. విద్యుత్ కొరత వలన హాస్పిటల్స్ లోని రోగులు, ఆపరేషన్ చేయించుకునే వారు తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు తెలుస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com