Italy: ఇటలీలో ప్రధాని మెలోనికి వ్యతిరేకంగా పాలస్తీనీయులు నిరసనలు

పాలస్తీనా అనుకూల నిరసనలతో ఇటలీ అట్టుడుకింది. పాలస్తీనా రాజ్యాన్ని గుర్తించడానికి ఇటలీ ప్రధాని జార్జియా మెలోని నిరాకరించారు. ఓ వైపు పాలస్తీనా రాజ్యం ఏర్పాటుకు ఫ్రాన్స్, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్ మద్దతు తెల్పుతుండగా ఇటలీ మాత్రం అందుకు నిరాకరించింది. దీంతో దేశ వ్యాప్తంగా 24 గంటల స్వారత్రిక సమ్మెకు పాలస్తీనా మద్దతుదారులైన ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చాయి. నిరసనల్లో భాగంగా పాలస్తీనీయులు విధ్వంసం సృష్టించారు. ఆస్తులు ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
వేలాది మంది పాలస్తీనా మద్దతుదాలు రోడ్లపైకి వచ్చి నానా బీభత్సం సృష్టించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణకు దిగారు. ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం కలిగించారు. ఓడరేవులు మూతపడ్డాయి. ఇక ఈ ఘర్షణల్లో 60 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. రోమ్‌లో 10 వేల మంది నిరసనకారులు రోడ్లపైకి రచ్చ రచ్చ చేశారు. ఆస్తుల విధ్వంసం సృష్టించారు. మిలన్‌లో సెంట్రల్ స్టేషన్ దగ్గర నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. నల్ల దుస్తులు ధరించి పాలస్తీనా జెండాలను ఊపుతూ నిరసనకారులు కిటికీలను కర్రలతో పగులగొట్టి, అధికారులపై కుర్చీలను విసిరారు. 10 మంది నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటలీ వ్యాప్తంగా నిరసనకారులంతా ‘‘ఫ్రీ పాలస్తీనా’’ అంటూ నినాదాలతో మార్మోగించారు.
ఇటలీలో పాలస్తీనీయులు సృష్టించిన విధ్వంసాన్ని ప్రధాని మెలోని తీవ్రంగా ఖండించారు. ఈ దాడులతో గాజాలోని ప్రజల జీవితాల్లో ఒక్క మార్పు కూడా తీసుకురాదన్నారు. ఇటాలియన్ పౌరులు నిర్దిష్ట పరిమాణాలు కలిగి ఉంటారని.. దుండగుల వల్ల కలిగే నష్టాలకు బాధపడతారని పేర్కొన్నారు. తిరిగి చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
అక్టోబర్ 7,2023న హమాస్ ఉగ్రవాదులు.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి 250 మందిని బందీలుగా తీసుకెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్.. హమాస్ అంతమే లక్ష్యంగా దాడులు చేస్తోంది. అయితే ఇకపై పాలస్తీనా రాజ్యం ఏర్పడదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. కానీ కొన్ని దేశాలు మాత్రం మద్దతు పలికాయి. కానీ ఇటలీ మాత్రం పాలస్తీనా రాజ్యానికి మద్దతు ఇవ్వలేదు. దీంతో ఇటలీలో పాలస్తీనా మద్దతుదారులు రెచ్చిపోయి ఆస్తులు ధ్వంసం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com