Papua New Guinea: పపువా న్యూ గినియా విషాదం.. మరణాలు 670కి పైమాటే
పసిఫిక్ ద్వీప దేశం పపువా న్యూ గినియాలో శుక్రవారం కొండచరియలు విరిగిపడి గ్రామాన్ని నేలమట్టం చేయడం తెల్సిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 670కిపైనే అని ఐరాసకు చెందిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేషన్(ఐవోఎం) ఆదివారం తెలిపింది. ఎంగా ప్రావిన్స్ అధికారులు, బాధిత యంబలి గ్రామస్తులు అందించిన సమాచారాన్ని బట్టి 150కిపైగా ఇళ్లు భూస్థాపితం కాగా వాటిలోని 670 మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు ఐవోఎం అంచనా వేసింది. క్షతగాత్రులు, గల్లంతైన వారి సంఖ్యలో స్పష్టత రాలేదని పేర్కొంది.
ఆదివారం ఐదు మృతదేహాలను వెలికి తీసినట్లు స్థానిక అధికారులు చెప్పారు. మట్టి, బండరాళ్లు, చెట్లు మూడు నుంచి నాలుగు ఫుట్‌బాల్ మైదానాలంత విస్తీర్ణంలో 6 నుంచి 8 మీటర్ల లోతున గ్రామాన్ని భూస్థాపితం చేశాయని, లోపల చిక్కుకున్న వారు బతికి బట్టకట్టేందుకు అవకాశాలు తక్కువని ఐవోఎం అంటోంది. మరోవైపు స్థానిక గిరిజన తెగల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. శనివారం జరిగిన ఘర్షణలో ఎనిమిది మంది చనిపోయారు. దాంతో సహాయక సిబ్బంది, అత్యవసరాలను చేరవేయడానికి ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది.
ప్రధాన రహదారులు దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. దీంతో, కొన్ని ప్రాంతాలకు హెలికాప్టర్ సహాయంతో మాత్రమే వెళ్లే వీలుంది. అయితే, సహాయక సిబ్బందితో కూడిన ఒక బృందం ప్రభావిత ప్రాంతానికి చేరుకుందని హ్యుమానిటేరియన్ ఏజెన్సీ కేర్ ఆస్ట్రేలియా తెలిపింది.శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడిన ఒక చిన్నారి సహా ఆరుగురికి స్థానిక అత్యవసర సేవల బృందం వైద్య సహాయాన్ని అందించిందని పపువా న్యూ గినియాలోని యూఎన్ రెసిడెంట్ కోఆర్డినేటర్ కార్యాలయం బీబీసీకి చెప్పింది. కేర్ ఆస్ట్రేలియా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు 60 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఇళ్లలోని వారి ఆచూకీ ఇంకా తెలియలేదని ఆ సంస్థ పేర్కొంది. కొండచరియలు విరిగిపడటం కొనసాగితే చుట్టుపక్కల ఇతర గ్రామాలు కూడా ప్రమాదంలో పడొచ్చని ఏజెన్సీ హెచ్చరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com