Nithyananda: కైలాస దేశంతో ఒప్పందం.. పదవి కోల్పోయిన ఓ దేశ మంత్రి

భారత్‌లో పలు అత్యాచార కేసులలో నిందితుడిగా ఉండి .. గుర్తుతెలియని ప్రదేశానికి పారిపోయిన వివాదాస్పద స్వామీజి నిత్యానంద మరోసారి వార్తల్లో కెక్కాడు. నిత్యానంద దెబ్బకి పరాగ్వే దేశంలో కీలక ప్రభుత్వాధికారి తన పదవికే రాజీనామా చేయాల్సి వచ్చింది. నిత్యానంద స్థాపించినట్లు చెప్పుకుంటున్న ఊహాజనిత దేశం.. కైలాసకు చెందిన ప్రతినిధులతో ఆయన అవగాహనా ఒప్పందం కుదుర్చుకోవడమే ఇందుకు కారణం. నిత్యానంద దక్షిణ అమెరికా దేశాలకు చెందిన పలు స్థానిక ప్రభుత్వాలను మోసం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
భారత్ నుంచి పారిపోయి ఈక్వెడార్ సమీపంలోని ఓ దీవిలో నివాసం ఉంటున్నట్లు భావిస్తున్న వివాదాస్పద స్వామి నిత్యానంద.. ఇప్పుడు ప్రపంచంలోని పలు దేశాలకు తలనొప్పిగా మారాడు. నిత్యానంద ప్రకటించినట్లు ప్రచారం జరుగుతున్న ఊహాజనిత దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ప్రతినిధులతో అవగాహనా ఒప్పందం చేసుకున్న పరాగ్వే వ్యవసాయశాఖ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆర్నాల్డో చమర్రో.. ఉద్యోగాన్ని కోల్పోయాడు.
అక్టోబర్ 16న కైలాస ప్రతినిధులు పరాగ్వే వ్యవసాయ మంత్రి కార్లోస్ జిమెనెజ్‌తో పాటు ఆర్నాల్డో చమర్రోను కలిసిన సందర్భంగా ఒప్పందం కుదిరింది. కైలాసతో దౌత్య సంబంధాల ఏర్పాటుకు కృషి చేస్తాననీ అంతర్జాతీయ వేదికలపై కైలాస సార్వభౌమత్వానికి గుర్తింపునకు మద్దతిస్తామని అర్నాల్డో ఒప్పందంపై సంతకం చేశారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చ జరిగింది. ఇదో కుంభకోణమని ఆ దేశ నెటిజన్లు ఆరోపించారు.
దీంతో చమర్రో వివరణ ఇచ్చారు. తనకు కైలాస దేశం ఎక్కడుందో తెలీదనీ.. నీటిపారుదల సహా ఇతర సమస్యల్లో సాయం చేస్తామని నిత్యానంద ప్రతినిధులు చెప్పడంతోనే పత్రంపై సంతకం చేశానని చెప్పారు. నిత్యానంద ప్రతినిధులు కూడా ఈ వివరాలను తమ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. పరాగ్వేలోని వివిధ మునిసిపాలిటీల అధికారులతో కూడా ఒప్పందం కుదిరినట్లు వివరించారు. పరాగ్వే మాత్రమే కాకుండా కెనడా, అమెరికాలోని నెవార్క్ నగర యంత్రాంగాన్ని కూడా కైలాస ప్రతినిధులు ఈ విధంగా మోసం చేశారు. ఈ విషయాన్ని నెవార్క్ అధికారులే స్వయంగా వెల్లడించారు.
నిత్యానంద భారత్‌లో అత్యాచారం సహా వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2019లో ఆయన గుర్తుతెలియని ప్రదేశానికి పారిపోయారు. ఈక్వెడార్ సమీపంలోని ఓ ద్వీపంలో నిత్యానంద ఉన్నట్లు ఇంటర్ పోల్ వర్గాలు తెలిపాయి. ఈక్వెడార్ మాత్రం తాము ఎవరికీ దీవిని అమ్మలేదని చెబుతోంది. నిత్యానంద కూడా గ్రాఫిక్స్ రూంలో కూర్చుని ప్రసంగాలు ఇవ్వడమే తప్ప.. బహిరంగ ప్రదేశాల్లో ఎప్పుడూ కనిపించలేదు. గతంలో కైలాస ప్రతినిధి అని చెప్పి.. విజయప్రియ నిత్యానంద అనే మహిళ ఫిబ్రవరిలో జెనీవాలో జరిగిన ఐరాస సమావేశానికి హాజరయ్యారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com