NASA Spacecraft: పార్కర్ సోలార్ ప్రోబ్ సురక్షితం

సూర్యుడి అన్వేషణ నిమిత్తం దానికి అత్యంత సమీపంలోకి వెళ్లిన పార్కర్ సోలార్ ప్రోబ్ (Parker Solar Probe) సురక్షితంగానే ఉందని నాసా (NASA) శుక్రవారం వెల్లడించింది. సూర్యుడి (Sun) బాహ్య వాతావరణంగా పిలిచే కరోనా పరిశోధన నిమిత్తం శాస్త్రవేత్తలు దాన్ని పంపించారు. కాగా సూర్యుడికి అతి సమీపంలోకి వెళ్లిన తర్వాత తాత్కాలికంగా దాని నుంచి సంకేతాలు అందలేదని అధికారులు పేర్కొన్నారు. వాటి కోసం శుక్రవారం వరకూ వేచి చూడాలని భావించారు. అయితే.. ఆ సంకేతాలు గురువారమే అందినట్లు పేర్కొన్నారు.
గురువారం రాత్రి పార్కర్ సోలార్ ప్రోబ్ నుంచి సంకేతం వచ్చిందని మేరీలాండ్‌లోని జాన్ హాప్కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ లేబోరేటరీ వెల్లడించింది. డిసెంబరు 24న సౌర ఉపరితలానికి 6.1 మిలియన్ కిలోమీటర్ల దూరంలోకి వెళ్లి, సూర్యుడికి అత్యంత దగ్గరగా చేరినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఏ వ్యోమ నౌక సూర్యుడికి ఇంత దగ్గరగా వెళ్లలేదని పేర్కొన్నారు. ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ జనవరి 1న తన పరిశోధనలకు సంబంధించిన వివరణాత్మక టెలిమెట్రీ డేటాను పంపనుందని నాసా పేర్కొంది. ఈ పరిశోధనల వల్ల సూర్యుడి బాహ్య వాతావరణంగా పిలిచే కరోనా ప్రాంతంలోని కణాలు మిలియన్ల డిగ్రీల వరకు ఎలా వేడెక్కుతాయనే విషయాన్ని శాస్త్రవేత్తలు అర్థం చేసుకోవడానికి వీలవుతుందని తెలిపారు.
నాసాతోపాటు పలు ఇతర పరిశోధన సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు పార్కర్ ప్రోబ్‌ను సంయుక్తంగా రూపొందించారు. నాసా తెలిపిన వివరాల ప్రకారం.. పార్కర్ సోలార్ ప్రోబ్ 1,800 డిగ్రీల ఫారెన్‌హీట్ (982 డిగ్రీల సెల్సియస్) వరకు ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది. అత్యధిక ఉష్ణోగ్రతలను సైతం తట్టుకునేలా దానిచుట్టూ పటిష్ఠ కవచం ఉంటుంది. నమూనాల సేకరణకు ఉపయోగించేందుకు బిగించిన కప్, మరో పరికరం మాత్రం కవచం బయట ఉంటాయి. అవి కరిగిపోకుండా టంగ్‌స్టన్, నియోబియం, మాలిబ్డినమ్, సఫైర్ వంటి పదార్థాలతో వాటిని తయారుచేశారు. కరోనా పొరపై ఏడేళ్లపాటు పరిశోధనలు జరపడమే ప్రాథమిక లక్ష్యంగా నాసా 2018లో పార్కర్ సోలార్ ప్రోబ్‌ను ప్రయోగించింది. ఈ వ్యోమ నౌక 2021 ఏప్రిల్‌లో 28న తొలిసారి కరోనా పొరలోకి ప్రవేశించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com