Italy: ఏమిరా... మీ వల్ల దేశానికి లాభం

కొందరు చేసిన తప్పులు చూడటానికి... వినటానికి చిన్నవిగా అనిపించినా.. అవి దేశ గౌరవానికి భంగం కలిగిస్తాయి. ఎక్కడో ఎవరో చేసిన తప్పులు దేశానికి అప్రతిష్టను తేవచ్చు. ఏకంగా దేశమే దిగివచ్చి తప్పును సరిదిద్దుకోవాల్సి రావచ్చు. అచ్చం అలాంటి ఘటనే ఇది. నలుగురు వెదవలు చేసిన పనికి ఓ దేశమే దిగి వచ్చింది. తమ పౌరుల ప్రవర్తనకు పశ్చాతాపం ప్రకటించింది. అసలు ఇంతకీ ఏం జరిగింది.. దేశమే దిగివచ్చి క్షమాపణలు చెప్పేంత తప్పు వాళ్లు ఏం చేశారు... పదం ప్రతీ పౌరుడు తప్పక తెలుసుకోవాల్సిన ఘటన ఇది...అసలేం జరిగిందంటే
ఇటలీ (Italy)కి చెందిన నలుగురు స్నేహితులు పర్యాటక ప్రాంతాలకు ప్రసిద్ధి చెందిన అల్బేనియా(Albania) దేశాన్ని సందర్శించడానికి వెళ్లారు. అక్కడ కొన్ని ప్రాంతాలను చూసిన తర్వాత ఒక రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ తమకు ఇష్టమైన వంటకాల్ని కడుపు నిండా తిన్నారు. భోజనం చాలా బాగుందని రెస్టారెంట్ యాజమాన్యాన్ని కూడా ఆ నలుగురు అభినందించారు. కానీ.. ఏడు వేల రూపాయల బిల్లు( restaurant bill) మాత్రం కట్టకుండా అక్కడి పరారయ్యారు. ఇప్పుడే వస్తామని చెప్పి బయటకు వెళ్లిన వాళ్లు.. అక్కడి నుంచి పారిపోయారు. నలుగురు ఇటాలియన్లు పారిపోయే దృశ్యాలు సెక్యూరిటీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అసలే బిల్లు కట్టలేదన్న కోపంలో ఉన్న యాజమాన్యం.. ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బిల్లు కట్టకుండా నలుగురు ఇటాలియన్లు పారిపోయారని ఆ వీడియోకి క్యాప్షన్ పెట్టింది. దీంతో.. ఆ వీడియో నెట్టింట్లో బాగా వైరల్ అయ్యింది. ఈ వ్యవహారాన్ని ‘డైన్ అండ్ డ్యాష్’గా పరిగణించారు. తమ రెస్టారెంట్‌లో భోజనం చేసి, బిల్లు కట్టకుండా వెళ్లిపోవడం ఇదే మొదటిసారని రెస్టారెంట్ యజమాని తెలిపారు.
డైన్ అండ్ డ్యాష్ ఇష్యూ ఎంత వైరల్ అయ్యిందంటే.. ఇది అల్బేనియా ప్రధాని ఎడీరమా (Edi Rama) దాకా వెళ్లింది. తర్వాత కొద్ది రోజులకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని(Italian PM Giorgia Meloni ) అల్బేనియా (Giorgia Meloni)కు వెళ్లారు.ఈ డైన్ అండ్ డ్యాష్ వ్యవహారాని ఎడి రామా... ఇటలీ ప్రధాని ముందు ప్రస్తావించారు. దీంతో అవమానంగా భావించిన మెలోని.. ఇటాలియన్ రాయబారిని బిల్లు కట్టాల్సిందిగా ఆదేశించారు. ఆ ఇడియట్స్ కోసం బిల్లు కట్టండని(Pay the bill for these idiots) ఆమె ఆదేశించారు. దీంతో.. వెంటనే ఇటాలియన్ రాయబారి ఆ బిల్లు కట్టేశారు. అక్కడి రెస్టారెంట్‌లో బాగా తిని పారిపోయిన నలుగరికి బాధ్యత వహిస్తూ ఇటలీ ప్రభుత్వం రెస్టారెంట్ బిల్లును చెల్లించింది.
ఇటాలియన్లు నిబంధనల్ని గౌరవిస్తారని, తమ రుణాల్ని వెంటనే చెల్లిస్తారని... ఇలాంటి ఘటనలు పునరావృతం కావన్న ఆశిస్తున్నామని ఇటలీ ప్రభుత్వం(Italy's embassy) ఓ ప్రకటన విడుదల చేసింది. బిల్లును చెల్లించడం గర్వించదగ్గ విషయమని, కొంతమంది నిజాయితీ లేని వ్యక్తులు తమ దేశ పరువుని తీయలేరని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com