China : ఫిలిప్పీన్స్ పడవలపై చైనా జల ఫిరంగులు

చైనా ఆగడాలు మితిమీరుతున్నాయి. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో ఆ దేశం చేసే దుశ్చర్యలకు అదుపులేకుండా పోతోంది. ఇప్పటికే నిబంధనలను నేలరాసి దక్షిణ చైనా సముద్రం అంతా తమదేనని చెప్పుకుంటున్న చైనా ఆ సంద్రంతో తీర ప్రాంతం కలిగిన ఇతర దేశాలను ఇబ్బందులకు గురిచేస్తోంది. తాజాగా ఫిలిప్పీన్స్‌కు చెందిన ఓ నౌకపై జులుం ప్రదర్శించింది. ఫిలిప్పీన్స్ ఆధీనంలో ఉన్న ఓ దీవిలోని సిబ్బందికి ఆహారం, నీళ్లు, ఇంధనం అందించేందుకు రెండు బోట్లు, ఓ నౌకను పంపింది. వాటిని డ్రాగన్ కోస్ట్ గార్డ్ నౌక నీటి ఫిరంగులతో అడ్డుకుంది. ఈ చర్యను ఫిలిప్పీన్స్ తీవ్రంగా ఖండించింది. తమ గస్తీ నౌకకు చేదు అనుభవం ఎదురైందని ఫిలిప్పీన్స్ ఒక వీడియో రిలీజ్ చేసింది.
ఫిలిప్పీన్స్ ఆధీనంలో ఉన్న సెకండ్ థామస్ షోల్ అనే దిబ్బకు ఆ దేశం ఆహారం, నీరు ,ఇంధనం ఉన్న రెండు పడవలను పంపగా వాటిపై చైనా దాడి చేసింది పడవలో ఉన్న సిబ్బంది భద్రతను పట్టించుకోకుండా చైనా చర్యలు ఉన్నాయంటూ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. ఇది అంతర్జాతీయ చట్టంతో సహా 1982 నాటి ఐరాస ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించటమే అని ఫిలిప్పీన్స్ పేర్కొంది.
నిజానికి దక్షిణ చైనా సముద్రంలో భారీ చమురు, గ్యాస్ నిక్షేపాలున్నాయి. అంతేకాదు ఈ సముద్రం అంతర్జాతీయ రవాణా నౌకల సంచారంతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఫిలిప్పీన్స్‌తోపాటు వియత్నాం, మలేసియా, తైవాన్, బ్రునైలకు ఆ సాగరంపై హక్కులు ఉన్నాయి. అయితే సముద్రమంతా తనదేనని చైనా వాదిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com