Israel-Hamas War: గాజాలో ఆకలికేకలు
గాజాను ఇజ్రాయెల్ దిగ్బంధించడంతో అక్కడ పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్నాయి. ఆహారం, ఇతర నిత్యావసరాల కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. గాజాలో ఆహారం కోసం లూటీలు మొదలయ్యాయి. ఇజ్రాయెల్ దాడుల కారణంగా తీవ్రమైన ఆహార కొరతతో అల్లాడుతున్న గాజా ప్రజలు ఐక్యరాజ్యసమితి గిడ్డంగులపై దాడికి దిగారు. అక్కడ నుంచి పిండి సహా ఇతర వస్తువులను ఎత్తుకెళ్లారు. గాజాలో ఆహారం కోసం ఒకరికొకరు కొట్టుకునే పరిస్థితి వస్తుందని ఇదివరకే అంతర్జాతీయ నిపుణులు హెచ్చరించారు. గాజాలో పబ్లిక్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతింది.గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆహారం, నీరు, ఇంధన కొరతతో అల్లాడుతున్న గాజాలో లూటీలు మొదలయ్యాయి. గత కొన్ని రోజులుగా ఒకటి రెండు రొట్టెలు మాత్రమే తింటూ జీవనం సాగిస్తున్న గాజా పౌరులు ఆహారం కోసం లూటీకి దిగారు. గాజాలోని ఐక్యరాజ్యసమితి సహాయక సామగ్రి ఉండే గిడ్డంగులపై వేలాది మంది గాజా పౌరులు దాడికి దిగారు. పిండి సహా ఇతర వస్తువులను అక్కడ నుంచి ఎత్తుకెళ్లారు.
యుద్ధం మొదలైన తర్వాత మూడు వారాలుగా గాజాలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. ఆహారం కోసం గాజాలో ఒకరికొకరు కొట్టుకునే పరిస్థితి వస్తుందని అంతర్జాతీయ నిపుణులు కొద్దిరోజుల క్రితమే హెచ్చరించారు. తాజాగా ఐరాస గిడ్డంగులపై గాజా ప్రజల దాడి వారి మాటలకు అద్దంపడుతున్నాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో గాజా ప్రజలు భయంతో, తీవ్ర నిరుత్సాహంతో ఉన్నారు. అక్కడ పబ్లిక్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పింది. గోదాముల్లోకి చొరబడటం ఆందోళనకర అంశమని, ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుందనడానికి ఇది సంకేతమని ఐక్యరాజ్యసమితి మానవతా విభాగం గాజా డైరెక్టర్ థామస్ పేర్కొన్నారు.
గాజాలో మొత్తం 23 లక్షల మంది ఉండగా...సహాయక సామగ్రి అంతంత మాత్రమే అందుతోంది. అది ఏ మూలకూ సరిపోవడం లేదు. విదేశాల నుంచి వచ్చిన సహాయ సామగ్రిలో తక్కువ మొత్తాన్నే ఈజిప్టులోని రఫా సరిహద్దు గుండా గాజా వెళ్లేందుకు ఇజ్రాయెల్ అనుమతిఇస్తోంది. ఐరాస సహాయక శిబిరాల్లోనే 6 లక్షల మందికిపైగా ప్రజలు తలదాచుకుంటున్నారు. గాజాలో ఉన్న పాఠశాలలు అన్ని పునరావాస శిబిరాలుగా మారిపోయాయి. భూతల దాడులు కూడా ఇజ్రాయెల్ మొదలు పెట్టడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్న భయం గాజా ప్రజల్లో నెలకొంది. 24 గంటల వ్యవధిలో గాజాలో 450కిపైగా టార్గెట్లపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ఉత్తరగాజాను ఖాళీ చేసిన లక్షలాది ప్రజలు దక్షిణగాజాలో తలదాచుకుంటున్నారు
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com