Gaza: హమాస్‌పై ప్రజలు తిరుగుబాటు..

గాజాలో హమాస్‌కు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబావుటా ఎగరేశారు. పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన ర్యాలీలు చేపట్టారు. హమాస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘హమాస్ అవుట్’ అంటూ నినాదాలు చేశారు. ఈ ఆందోళనల్లో పెద్ద ఎత్తున పురుషులు పాల్గొన్నారు. ఉత్తర గాజాలోని బీట్ లాహియాలో ఈ నిరసన ర్యాలీలు చేపట్టారు. తక్షణమే యుద్ధం ముగించాలని.. హమాస్ అధికారం నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు.
‘‘యుద్ధాన్ని ఆపండి.. శాంతియుతంగా జీవించాలనుకుంటున్నాం.’’ అని నినాదాలు చేశారు. బ్యానర్‌లను పట్టుకుని ‘‘హమాస్ అవుట్.. అవుట్.. అవుట్’’ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ నిరసనల్లో వందలాది మంది పాల్గొన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఆందోళనలను ముసుగులతో వచ్చిన హమాస్ ఉగ్రవాదులు.. నిరసన ర్యాలీని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ప్రజలను బెదిరించి పంపించినట్లు సమాచారం. మరికొందరు లాఠీలు పట్టుకుని నిరసనకారులను బలవంతంగా చెదరగొట్టినట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
నిరసనల్లో పాల్గొనాలని పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో ఈ స్థాయిలో ప్రజలు గుమికూడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నిరసన ఎవరు నిర్వహించారో తమకు తెలియదని మొహమ్మద్ అనే వ్యక్తి మీడియాతో మాట్లాడాడు. అయితే హమాస్ దళాలు.. నిరసనను ఆపడానికి ప్రయత్నం చేసిందని పేర్కొన్నారు. హమాస్.. గాజాను వదిలిపెడితే.. యుద్ధం ఆగుతుందని.. ప్రజలు ప్రశాంతంగా జీవిస్తారని మరొక నిరసనకారుడు విజ్ఞప్తి చేశాడు. అయితే ఇదే నిరసన బుధవారం కూడా కొనసాగించాలని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీన్నీ హమాస్ ఎలా నిర్వీర్యం చేస్తుందో చూడాలి.
2007 నుంచి హమాస్ గాజాను పాలిస్తోంది. ఇజ్రాయెల్‌తో యుద్ధానికి దిగినప్పటి నుంచి హమాస్‌పై వ్యతిరేకత మొదలైంది. అయినా కూడా హమాస్‌కు చాలా చోట్ల పెద్ద ఎత్తున మద్దతుదారులు ఉండడం విశేషం. ప్రస్తుతం గాజాలో 35 శాతం పాలస్తీనియన్లు హమాస్‌కు మద్దతుగా ఉన్నారు. 26 శాతం మంది ప్రత్యర్థి, రమల్లాకు చెందిన పాలస్తీనియన్ అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com