Chatgpt Health Advice: కొంపముంచిన చాట్ జీపీటీ సలహా..

టెక్నాలజీ వాడకం పెరిగాక, చాలామంది చిన్న చిన్న సలహాల కోసం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మీద ఆధారపడుతున్నారు. కానీ, ఈ నమ్మకమే కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెస్తుందని అమెరికాలో జరిగిన ఓ సంఘటన తీవ్రంగా హెచ్చరిస్తోంది. చాట్‌జీపీటీ ఇచ్చిన ఓ డైట్ సలహాను గుడ్డిగా పాటించిన ఓ వ్యక్తి, ప్రాణాంతకమైన బ్రోమైడ్ పాయిజనింగ్ బారిన పడి ఆసుపత్రి పాలయ్యాడు. ఏఐ సలహా వల్ల ఈ రకమైన పాయిజనింగ్ జరగడం ప్రపంచంలో ఇదే మొదటిసారి కావచ్చని వైద్యులు చెబుతున్నారు.
యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌కు చెందిన వైద్యులు ఈ వింత కేసు వివరాలను 'అనల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్: క్లినికల్ కేసెస్' అనే జర్నల్‌లో ప్రచురించారు. వారి కథనం ప్రకారం, ఓ వ్యక్తి తన ఆహారంలో ఉప్పుకు బదులుగా సురక్షితమైన ప్రత్యామ్నాయం కోసం చాట్‌జీపీటీని సలహా అడిగాడు. దానికి ఏఐ సోడియం బ్రోమైడ్‌ను సూచించింది. దానివల్ల కలిగే ప్రమాదాల గురించి ఎలాంటి హెచ్చరిక చేయకపోవడంతో, ఆ వ్యక్తి మూడు నెలల పాటు దానిని తీసుకున్నాడు.
కొంతకాలానికి అతని ప్రవర్తనలో తీవ్రమైన మార్పులు వచ్చాయి. తన పొరుగింటి వారు తనపై విష ప్రయోగం చేస్తున్నారని భయపడుతూ ఆసుపత్రికి వెళ్లాడు. వైద్యులు పరీక్షించగా, దాహం వేస్తున్నా నీళ్లు తాగడానికి నిరాకరించడం, భ్రమలకు లోనవడం, తీవ్రమైన ఆందోళన వంటి లక్షణాలు కనిపించాయి. అతని పరిస్థితి మరింత దిగజారి, మతిస్థిమితం కోల్పోవడంతో వైద్యులు అతడిని మానసిక చికిత్స కోసం ప్రత్యేక వార్డుకు తరలించాల్సి వచ్చింది.
చికిత్సలో భాగంగా అతనికి యాంటీసైకోటిక్ మందులు, ఫ్లూయిడ్స్ ఎక్కించడంతో క్రమంగా కోలుకున్నాడు. కాస్త నిలకడగా అయ్యాక, అసలు విషయం వైద్యులకు చెప్పాడు. ఉప్పుకు బదులుగా ఏఐ చెప్పిన సలహా పాటించానని, అదే ఇంతటి ప్రమాదానికి కారణమని తెలియదని వాపోయాడు. ఆసక్తికరంగా, వైద్యులు అదే ప్రశ్నను మళ్లీ చాట్‌జీపీటీని అడిగినప్పుడు, అది మళ్లీ బ్రోమైడ్‌ను సూచించిందే తప్ప, దాని ప్రమాదాల గురించి హెచ్చరించలేదు.
గతంలో బ్రోమైడ్ సమ్మేళనాలను ఆందోళన, నిద్రలేమి మందులలో వాడేవారు. కానీ వాటి తీవ్ర దుష్ప్రభావాల కారణంగా దశాబ్దాల క్రితమే నిషేధించారు. ప్రస్తుతం పశువుల మందులు, కొన్ని పారిశ్రామిక ఉత్పత్తులలో మాత్రమే దీనిని వాడుతున్నారు. సుమారు మూడు వారాల చికిత్స తర్వాత ఆ వ్యక్తి పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు. ఈ సంఘటన ఒకటే చెబుతోందని, శాస్త్రీయ సమాచారం కోసం ఏఐ ఉపయోగపడినా, వైద్య సలహాలకు మాత్రం దానిని ఎప్పటికీ ప్రత్యామ్నాయంగా భావించరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com