Rodrigo Duterte: ఫిలిప్పీన్స్ మాజీ అధ్య‌క్షుడు రోడ్రిగో డ్యుటెర్టీ అరెస్టు

Rodrigo Duterte:  ఫిలిప్పీన్స్ మాజీ అధ్య‌క్షుడు రోడ్రిగో డ్యుటెర్టీ అరెస్టు
X
డ్ర‌గ్గీల‌ను కాల్చి చంపిన కేసులో..

ఫిలిప్పీన్స్ మాజీ అధ్య‌క్షుడు రోడ్రిగో డ్యుటెర్టీ ని .. పోలీసులు అరెస్టు చేశారు. అంత‌ర్జాతీయ క్రిమిన‌ల్ కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్ర‌కారం ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్నారు. డ్ర‌గ్స్‌పై యుద్ధం చేప‌ట్టిన డ్యుటెర్టీ.. త‌న ప‌దవీకాలంలో డ్ర‌గ్స్ బాధితుల‌కు విచ‌క్ష‌ణార‌హితంగా చంపేసిన విష‌యం తెలిసిందే. హాంగ్ కాంగ్ నుంచి వ‌చ్చిన డ్యుటెర్టీని మ‌నీలా విమానాశ్ర‌యంలో అరెస్టు చేశారు. యాంటీ డ్ర‌గ్స్ ఊచ‌కోత స‌మ‌యంలో.. 2016 నుంచి 2022 మ‌ధ్య వేల సంఖ్యలో జ‌నం చ‌నిపోయారు. డ్ర‌గ్స్‌పై వార్ విష‌యంలో జైలుకు వెళ్ల‌డానికైనా సిద్ధ‌మే అని 79 ఏళ్ల డ్యుటెర్టి తెలిపారు.

డ్యుటెర్టీ అరెస్టు చ‌రిత్రాత్మ‌కం అని ఫిలిప్పీన్స్‌లో ఉన్న అంత‌ర్జాతీయ మాన‌వ హ‌క్కుల కూట‌మి పేర్కొన్న‌ది. డ్యుటెర్టి పాల‌న స‌మ‌యంలో దారుణంగాహ‌త్య‌లు జ‌రిగాయ‌ని, ఆ సామూహిక హ‌త్య‌ల‌కు డ్యుటెర్టినే బాధ్యుడు అని తెలిపారు. ఐసీసీ నుంచి ఫిలిప్పీన్స్ ఉప‌సంహ‌రించుకున్న‌ద‌ని, మాజీ అధ్య‌క్షుడు డ్యుటెర్టిని అరెస్టు చేయ‌డం అక్ర‌మం అవుతుంద‌ని మాజీ అధికార ప్ర‌తినిధి సాల్వ‌డోర్ ప్యానెలో తెలిపారు. ఫిలిప్పీన్స్‌లోని ఓ న‌గ‌ర మేయ‌ర్‌గా ఉన్న డ్యుటెర్టి.. అక్క‌డ డ్ర‌గ్స్ క్రైంపై తీవ్ర పోరాటం చేశారు. ఆ వాగ్ధానంతో దేశాధ్య‌క్ష ప‌ద‌వికి ఎన్నిక‌య్యారు. ఆ త‌ర్వాత డ్ర‌గ్స్ అనుమానితుల్ని షూట్ చేసే ఆదేశాల‌కు ఇచ్చారు. డ్ర‌గ్స్‌పై చేప‌ట్టిన యుద్ధంలో సుమారు ఆరు వేల మంది మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఆ సంఖ్య ఎక్కువ ఉండే అవ‌కాశాలు ఉన్న‌ట్లు మాన‌వ హ‌క్కుల సంఘాలు పేర్కొంటున్నాయి.

30 ల‌క్ష‌ల మంది యూదుల‌ను హిట్ల‌ర్ హ‌త‌మార్చాడ‌ని, ఫిలిప్పీన్స్‌లో ఉన్న 30 ల‌క్ష‌ల మంది డ్ర‌గ్ ఉన్మాదుల్ని చంప‌నున్న‌ట్లు డ్యుటెర్టి ఓ సారి ఎప్పారు. 2016లో తొలిసారి ఐసీసీ డ్యుటెర్టిపై కేసు న‌మోదు చేసింది. 2021లో విచార‌ణ మొద‌లుపెట్టింది. డ్యుటెర్టి కూమార్తె సారా డ్యుటెర్టి ప్ర‌స్తుతం ఫిలిప్పీన్స్ ఉపాధ్య‌క్షురాలిగా ఉన్నారు. 2028లో జ‌రిగే దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఆమె ప్రెసిడెంట్ అభ్య‌ర్థిగా పోటీప‌డే అవ‌కాశాలు ఉన్నాయి.

Tags

Next Story