Kidney Transplantation: ఇకపై పంది.. ఓ అవయువ దాత
అవయవ మార్పిడి చరిత్రలో పెద్ద ముందడుగు పడింది. అమెరికాలో బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తికి పంది కిడ్నీ అమర్చగా అది నెల రోజులకుపైగా చక్కగా పని చేస్తోంది. రెండో నెలలోనూ దాని పనితీరును వైద్యులు పరిశీలించనున్నారు. బతికున్న వ్యక్తులపై కూడా ఈ తరహా ప్రయోగాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ తరహా ప్రయోగాలు సత్ఫలితాలను ఇస్తే మానవులకు అవయవ దాతల కొరతను అధిగమించి ఎన్నో ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది.
అవయవాలు దెబ్బతిని అవయవ దాతలు దొరకకు ప్రాణాలు కోల్పోతున్న వారు ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో మానవులకు అవయవ దాతల కొరతను అధిగమించే దిశగా కృషి చేస్తున్న వైద్యులు కీలక పురోగతిని సాధించారు. బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తికి జన్యుమార్పిడి చేసిన పంది మూత్రపిండాన్ని అమర్చగా నెల రోజులకుపైగా ఆ అవయవం చక్కగా పని చేస్తోంది. తమ పరిశోధన సత్ఫలితాన్నివ్వడంతో వైద్యులు హర్షం వ్యక్తం చేశారు. గతంలోనూ ఇలాంటి ప్రయత్నమే చేయగా వరాహ మూత్రపిండం రెండు రోజులకు మించి పనిచేయలేదని, ఇప్పుడు ఏకంగా నెల రోజులకుపైగా పనిచేయడం అద్భుతమేనని న్యూయార్క్ వర్సిటీకి చెందిన ట్రాన్స్‌ప్లాంట్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ రాబర్ట్ మోంట్‌గోమెరీ తెలిపారు. మనుషులకు జంతువుల అవయవాలను అమర్చడంలో ఇదో ముందడుగని అభివర్ణించారు. రెండో నెలలోనూ మార్పిడి అవయవం ఎలా పనిచేస్తుందో పరిశీలిస్తామని వెల్లడించారు.
ఒక 57ఏళ్ల వ్యక్తి శరీరాన్ని ఆయన రక్తసంబంధీకులను ఒప్పించి ఈ ప్రయోగానికి వైద్యులు ఎంచుకున్నారు. జులై 14న బెయిన్‌డెడ్ వ్యక్తి రెండు కిడ్నీల స్థానంలో జన్యు మార్పిడి చేసిన పందికి చెందిన ఒక మూత్ర పిండాన్ని అమర్చగా వెంటనే అది మూత్రాన్ని విడుదల చేసినట్లు తెలిపారు. ఈ ప్రయోగం సఫలమవడంతో బతికున్న వ్యక్తులపై కూడా ఈ ప్రయోగం చేయాలని వైద్యులు భావిస్తున్నారు.వరాహం అవయవం నిజంగా మానవ అవయవంలా పని చేస్తోందని NYU లాంగోన్ ట్రాన్స్‌ప్లాంట్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ రాబర్ట్ మోంట్‌గోమెరీ అన్నారు. పంది కిడ్నీ మానవ కిడ్నీ కంటే మెరుగ్గా ఉన్నట్లు తెలిపారు. గత ఏడాది మేరీలాండ్ వర్సిటీ వైద్యులు జన్యుమార్పిడి పంది గుండెను ఓ వ్యక్తికి అమర్చి చరిత్ర సృష్టించారు. ఆ వ్యక్తి రెండు నెలలు మాత్రమే జీవించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com