Brazil: కుప్ప కూలిన విమానం.. 14 మంది దుర్మరణం
బ్రెజిల్‌లోని ఉత్తర అమెజాన్ రాష్ట్రంలో శనివారం ఓ విమానం కుప్పకూలింది. ఘోర విమాన ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది అంతా దుర్మరణం చెందారు. మొత్తం 14 మంది మరణించినట్టు గవర్నర్ విల్సన్ లీమా సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 12 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. 18 ప్యాసెంజర్లను తరలించగలిగిన ఈ ట్విన్ ఇంజిన్ విమానాన్ని బ్రెజిల్ సంస్థ ఎంబ్రేయర్ తయారు చేసింది.
రాష్ట్ర రాజధాని మనౌస్‌కు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న బార్సిలోస్ ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక మేయర్‌ను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. ఈ ఘటనపై అమెజాన్ గవర్నర్ విల్సన్ లిమా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. “శనివారం బార్సిలోనాలో జరిగిన విమాన ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది మరణించినందుకు నేను తీవ్రంగా చింతిస్తున్నాను” అని గవర్నర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
అవసరమైన సహాయం అందించేందుకు మా బృందాలు పని చేయడం ప్రారంభించాయని తెలిపారు. ” మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి, ప్రార్థనలు తెలియజేస్తున్నానని ” అని అతను చెప్పారు. మరోవైపు మనౌస్ ఏరోటాక్సీ ఎయిర్‌లైన్స్ కూడా ఈ ఘటనను ధృవీకరించింది. దీనిపై విచారణ జరుపుతున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే ఈ ప్రమాదంలో మరణించిన వారి గురించి ఇంకా సమాచారం లేదు. గోప్యత కారణంగా మేము తదుపరి సమాచారాన్ని అందించలేమని మనౌస్ ఏరోటాక్సీ ఎయిర్‌లైన్ తెలిపింది. దర్యాప్తు సాగుతున్న కొద్దీ అవసరమైన అన్ని సమాచారం, అప్‌డేట్‌లు ఇస్తామని చెప్పారు. మరణించిన వారిలో అమెరికన్ పౌరులు కూడా ఉన్నారని కొన్ని బ్రెజిలియన్ మీడియా సంస్థలు నివేదించాయి. అయితే, రాయిటర్స్ ఆ నివేదికలను ధృవీకరించలేదు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com