Modi-Putin: అమెరికాలో మోదీ-పుతిన్ సెల్ఫీ వైరల్‌

Modi-Putin: అమెరికాలో మోదీ-పుతిన్ సెల్ఫీ వైరల్‌
X
అలా చేస్తే నోబెల్‌ రాదంటూ ట్రంప్‌పై విమర్శలు

రష్యా-భారత్‌ మధ్య స్నేహం మరింత బలపడుతోంది. అదే సమయంలో ట్రంప్‌ నిర్ణయాలతో అమెరికా-భారత్‌ మధ్య బంధం దిగజారుతోంది. ఈ పరిణామాలపై అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఇటీవలే రష్యా అధినేత పుతిన్‌ (భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్వయంగా పుతిన్‌కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరూ ఒకే కారులో ప్రయాణించారు. ఆ సమయంలో వీరిద్దరూ తీసుకున్న ఓసెల్ఫీ ఫొటో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఆ సెల్ఫీ ఫొటో ముఖ్యంగా అమెరికా రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ ఒక్క చిత్రం అనేక సందేశాలు ఇస్తోందని అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు సిడ్నీ కమ్‌లాగర్ దువ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా భారత్‌పై ట్రంప్‌ ప్రభుత్వ వైఖరిని ఆమె ప్రశ్నించారు. ఇలాంటి విధానాలు అమెరికా-భారత్‌ మధ్య ఉన్న వ్యూహాత్మక, పరస్పర అవగాహనకు నష్టం చేకూరుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌ని దూరం చేసుకునేంటే అమెరికాకే నష్టమని వ్యాఖ్యానించారు. ‘వ్యూహాత్మక భాగస్వాములను ప్రత్యర్థులవైపు మళ్లించడం ద్వారా నోబెల్ బహుమతి గెలవలేరు’ అంటూ ట్రంప్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పటికైనా ట్రంప్‌ ప్రభుత్వ వైఖరిలో మార్పురావాలని వ్యాఖ్యానించారు.

2022లో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైన తర్వాత పుతిన్ భారత్ పర్యటనకు రావడం ఇదే తొలిసారి. దిల్లీలోని పాలం విమానాశ్రయంలో దిగగానే రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. ఆయన్ను మోదీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరూ తమ కాన్వాయ్‌లను వదిలి, టయోటా ఫార్చ్యూనర్‌లో ప్రధాని అధికారిక నివాసం వరకు కలిసి ప్రయాణించడం చర్చనీయాంశమైంది. ‘‘ఆ కారు రైడ్ నా ఆలోచన. మా స్నేహానికి చిహ్నం. ఆ సమయంలో మేం మాట్లాడుతూనే ఉన్నాం. చర్చించుకోవడానికి ఎప్పుడూ ఏదోఒక అంశం ఉంటుంది’’ అని ఆ రైడ్‌ గురించి పుతిన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. రష్యా చమురు కొనుగోలు చేస్తోన్న భారత్‌పై అమెరికా భారీగా సుంకాలు విధించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. అమెరికా వ్యవహార శైలి.. భారత్‌ను రష్యా వైపునకు నెట్టివేస్తోందని సిడ్నీ విమర్శించారు.

Tags

Next Story