PM Modi: దౌత్య చర్చలే పరిష్కారం- గల్ఫ్ దేశాధినేతలకు మోడీ ఫోన్

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత విషమిస్తున్నాయి. ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్ మిత్రదేశాలుగా ఉన్న గల్ఫ్ దేశాలపై క్షిపణి దాడులు ప్రారంభించినట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఇరాక్, బహ్రెయిన్, కువైట్, ఒమన్, జోర్డాన్లపై క్షిపణులు ప్రయోగించినట్లు సమాచారం. పలు ప్రాంతాల్లో భవనాలు ధ్వంసమయ్యాయని, భద్రతా వ్యవస్థలు అప్రమత్తమయ్యాయని స్థానిక వర్గాలు చెబుతున్నాయి.
అంతర్జాతీయ మద్దతు వెల్లువ
ఈ పరిణామాల నేపథ్యంలో గల్ఫ్ దేశాలకు పలు పాశ్చాత్య దేశాలు మద్దతు ప్రకటించాయి. ఫ్రాన్స్, జర్మనీ, యునైటెడ్ కింగ్‌డమ్ ఇప్పటికే సంఘీభావం వ్యక్తం చేశాయి. తాజాగా నరేంద్ర మోదీ కూడా గల్ఫ్ దేశాల నాయకులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితులపై చర్చించారు.
సౌదీ యువరాజుతో మోదీ సంభాషణ
సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్తో మోదీ ఫోన్‌లో మాట్లాడినట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. సౌదీ అరేబియాపై జరిగిన దాడులను భారత్ ఖండించినట్లు తెలిపారు. ఇది ఆ దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించే చర్యగా పేర్కొన్నారు. ప్రాంతీయ శాంతి, స్థిరత్వం త్వరగా పునరుద్ధరించాల్సిన అవసరాన్ని ఆయన రేఖాంకితం చేశారు. ఈ క్లిష్ట సమయంలో సౌదీలోని భారతీయుల భద్రతకు సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.
బహ్రెయిన్ రాజుతో చర్చ
బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో కూడా ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ జరిపారు. బహ్రెయిన్‌పై జరిగిన దాడులను భారత్ తీవ్రంగా ఖండించిందని తెలిపారు. ఆ దేశంలో నివసిస్తున్న భారతీయుల రక్షణకు అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు.
జోర్డాన్, ఇజ్రాయెల్ నేతలతో సంప్రదింపులు
జోర్డాన్ రాజు అబ్దుల్లా IIతోనూ ప్రధాని మోదీ చర్చించారు. అంతకుముందు బెంజమిన్ నెతన్యాహుతో కూడా ఫోన్‌లో మాట్లాడినట్లు వెల్లడించారు. ప్రాంతీయ పరిస్థితులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసిందని, పౌరుల రక్షణ అత్యంత ముఖ్యమని స్పష్టం చేసినట్లు తెలిపారు. శత్రుత్వానికి త్వరగా ముగింపు పలకాలని పునరుద్ఘాటించారు.
భారతీయుల భద్రతపై దృష్టి
గల్ఫ్ దేశాల్లో దాదాపు 90 లక్షల మంది భారతీయులు నివసిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తూ, అవసరమైన భద్రతా చర్యలు తీసుకుంటోంది. దౌత్య మార్గాల్లో వివాదాలను పరిష్కరించుకోవాలని, సంభాషణల ద్వారానే శాంతి సాధ్యమని భారత్ పలు దేశాల నేతలకు సూచిస్తోంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఈ ఉద్రిక్తతలు ఎంతవరకు విస్తరిస్తాయో అన్న దానిపై అంతర్జాతీయ సమాజం ఆందోళనతో ఎదురుచూస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
