Donald Trump: గాజా విషయంలో, ట్రంప్‌కు మోడీ అభినందనలు..

భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య గురువారం ఫోన్ సంభాషణ జరిగింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన చారిత్రక గాజా శాంతి ప్రణాళిక విజయవంతం కావడం పట్ల ట్రంప్‌కు ప్రధాని మోదీ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. అదే సమయంలో, ఇరు దేశాల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న వాణిజ్య చర్చల్లో సాధించిన పురోగతిని కూడా ఇరువురు నేతలు సమీక్షించుకున్నారు.
ఈ సంభాషణ వివరాలను ప్రధాని మోదీ 'ఎక్స్' వేదికగా పంచుకున్నారు. "నా మిత్రుడు, అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడాను. చారిత్రక గాజా శాంతి ప్రణాళిక విజయవంతమైనందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపాను. ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చల్లో సాధించిన మంచి పురోగతిని కూడా సమీక్షించాం. రాబోయే వారాల్లోనూ టచ్‌లో ఉండాలని అంగీకరించాం" అని మోదీ తన పోస్టులో పేర్కొన్నారు.
నెల రోజుల వ్యవధిలో ఇరువురు నేతల మధ్య ఫోన్ సంభాషణ జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. సెప్టెంబర్ 16న ప్రధాని మోదీ 75వ జన్మదినం సందర్భంగా ట్రంప్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కూడా ఉక్రెయిన్ శాంతి చర్చల విషయంలో ట్రంప్ చొరవకు మోదీ మద్దతు ప్రకటించారు. దీనికి ట్రంప్ కూడా ధన్యవాదాలు తెలిపారు.
కొంతకాలంగా నెలకొన్న ఉద్రిక్తతల తర్వాత భారత్, అమెరికా సంబంధాలు మళ్లీ గాడిన పడుతున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు తిరిగి ప్రారంభం కావడమే ఇందుకు నిదర్శనం. గత నెలలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్, అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్‌తో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సందర్భంగా సమావేశమయ్యారు. ఈ చర్చలు ఫలప్రదంగా జరిగాయని, త్వరలోనే ఇరు పక్షాలకు ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత్‌తో వాణిజ్య చర్చల విషయంలో అమెరికా సానుకూలంగా ఉందని, భారత్ కూడా ఆచరణాత్మక ధోరణితో వ్యవహరిస్తోందని యూఎస్ వాణిజ్య ప్రతినిధి గ్రీర్ ఇటీవల వ్యాఖ్యానించారు. అదేవిధంగా, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో భేటీ అనంతరం అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కూడా భారత్ తమకు అత్యంత కీలకమైన దేశమని పేర్కొనడం ఇరు దేశాల మధ్య బలపడుతున్న సంబంధాలకు అద్దం పడుతోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com