Rafale deal: ఫ్రాన్స్ నుంచి నావికా రఫేల్ జెట్‌లు
భారత నౌక దళం కోసం రాఫెల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 13 నుంచి రెండు రోజులపాటు ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో రాఫెల్ విమానాల కొనుగోళ్లకు సంబంధించిన ఒప్పందాలపై ప్రధాని సంతకం చేసే అవకాశం ఉందని ఇండియా నేవీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రధాని పర్యటన నేపథ్యంలో రక్షణ రంగానికి సంబంధించి ఆయుధాలు, ఇతర సామగ్రి సేకరణపై నౌకా దళం తుది సమావేశం నిర్వహించింది. అమెరికా, ఫ్రాన్స్ దేశాలకు చెందిన ఫైటర్ జెట్లపై ఈ భేటీలో మరోసారి చర్చించారు. అమెరికా ఎఫ్-18 సూపర్ హార్నెట్స్ కంటే కూడా ఫ్రెంచ్ రాఫెల్ మెరైన్ అత్యుత్తమైందిగా అధికారులు నిర్ణయానికి వచ్చారు. అయితే, వీటి ధరలపై స్పష్టత లేదు. కానీ, గతంలో కొనుగోలు చేసిన ఐఏఎఫ్ కంటే తక్కువ ధరే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు జూలై 14న ఫ్రాన్స్ జాతీయ దినోత్సవానికి ప్రధాని మోదీ గౌరవ అతిథిగా హాజరు కానున్నారు. ఈ నెల 13 నుంచి రెండు రోజుల పాటు ప్రాన్స్‌లో ఆయన పర్యటించనున్నారు. ఈ సందర్భంగా 24 నుంచి 30 రాఫెల్ మెరైన్ జెట్స్‌ను కొనుగోలు చేసే అంశాన్ని ఆయన ప్రకటించడంతోపాటు ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఇది భారత ప్రభుత్వానికి-ఫ్రాన్స్ ప్రభుత్వానికి మధ్య ఒప్పందంగా పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ద్వారా కొనుగోలు ప్రక్రియ సులభతరంగా ఉంటుందని అంచనా వేశారు. విమానవాహక నౌక INS విక్రాంత్’లో మోహరించేందుకు తగిన యుద్ధ విమానాల కోసం భారత నావికాదళం శోధిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాఫెల్ మెరైన్ జెట్స్‌కు అధికారులు మొగ్గు చూపారు. వీటి శిక్షణకు తక్కువ సమయం పడుతుండడం, రిపేర్లు, నిర్వహణ వంటివి తక్కువగా ఉండడం కలిసి వస్తుందని భావిస్తున్నారు. గతేడాది అమెరికాకు చెందిన ఎఫ్/ఏ-18, ఫ్రాన్స్‌కు చెందిన రాఫెల్ ఫైటర్ జెట్స్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత ఫ్రాన్స్ ఉత్పత్తులే అత్యుత్తమంగా ఉన్నాయని పేర్కొంటూ కేంద్రానికి నివేదిక అందించారు. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటనలో రాఫెల్ కొనుగోళ్లు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ప్రియమైన నరేంద్ర, గౌరవ అతిథిగా జూలై 14 పరేడ్ కి పారిస్‌కు మిమ్మల్ని స్వాగతిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నానని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ట్వీట్ చేశారు. ప్రధాని ఫ్రాన్స్ పర్యటనలో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింతగా బలపడనుంది. ఈవెంట్ ఫ్లై పాస్ట్‌లో పాల్గొనేందుకు భారత వైమానిక దళం తమ యుద్ధ విమానాలను మోహరించనుంది . బాస్టిల్ డే రోజున జరిగే కవాతులో భారత సైనిక బృందం కూడా భాగం అవుతుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com