Bastille Day: బాస్టిల్‌ డే వేడుకల్లో పాల్గొన్న మోదీ

Bastille Day: బాస్టిల్‌ డే వేడుకల్లో పాల్గొన్న మోదీ
X
బాస్టిల్‌ డే పరేడ్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ... భారత ఆర్మీకి సెల్యూట్ చేసిన ప్రధాని... మేక్రాన్‌తో కలిసి పరేడ్‌ వీక్షణ....

ఫ్రాన్స్‌ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాస్టిల్‌ డే పరేడ్‌ (Bastille Day Parade) అట్టహాసంగా ప్రారంభమైంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) ... బాస్టిల్‌ డే (Bastille Day) వేడుకల్లో పాల్గొన్నారు. సాధారణంగా విదేశీ నేతలు పాల్గొనని ఈ వేడుకల్లో భారత ప్రధాని రెండోసారి పాల్గొన్నారు. బాస్టిల్ డే పరేడ్‌‍(Bastille Day Parade)లో గౌరవ అతిథిగా పాల్గొన్న ప్రధాని మోడీ(PM Modi), ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి పరేడ్‌ను వీక్షించారు. ఇరు దేశాధినేతలు సైనికుల గౌరవవందనాన్ని స్వీకరించారు.


ఐరోపాలోనే అతిపెద్ద కవాతుగా బాస్టీల్‌ డే పరేడ్‌ పేరొందింది. ఇందులో భారత సైనిక బృందాలు కూడా పాల్గొంటున్నాయి. భారత సాయుధ దళాలకు చెందిన 269 మంది సభ్యుల బృందం.. ఫ్రాన్స్‌ దళాలతో కలిసి ఈ పరేడ్‌లో పాల్గొంది. దీంతో పాటు భారత్‌కు చెందిన నాలుగు రఫేల్‌ విమానాలు, రెండు సీ-17 గ్లోబ్‌మాస్టర్లు పారిస్ గగనతలంలో విన్యాసాలు ప్రదర్శించాయి.


భారత్‌, శతాబ్దాల నాటి తత్వంతో ప్రేరణ పొందిందని, శాంతియుతంగా, సుసంపన్నగా, సుస్థిరమైనదిగా మార్చడానికి కట్టుబడి ఉందని మోదీ ట్వీట్‌(MODI TWEET) చేశారు. బలమైన, విశ్వసనీయ భాగస్వామిగా ఉన్నందుకు 140 కోట్ల మంది భారతీయులు ఫ్రాన్స్‌కు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలుపుతారని. బంధం మరింత దృఢపడుతుందని ప్రధాని ట్వీట్ చేశారు.


ప్రపంచ చరిత్రలో దిగ్గజమైన, భవిష్యత్తులో నిర్ణయాత్మక పాత్ర పోషించాల్సి ఉన్న భారత్‌ తమకు వ్యూహాత్మక భాగస్వామని.. నిజమైన స్నేహితుడని మేక్రాన్‌ ట్వీట్‌ చేశారు . బాస్టిల్‌ డే పరేడ్‌లో గౌరవ అతిథిగా భారత్‌ పాల్గొనడం గర్వంగా ఉందని ట్వీట్‌లో పేర్కొన్నారు.


ప్రధాని మోదీ నిన్న రాత్రి ప్రవాస భారతీయులతో ముచ్చటించారు. అనంతరం అధ్యక్షుడు మేక్రాన్‌ దంపతులు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మేక్రాన్‌.. ప్రధాని మోదీని ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర, సైనిక పురస్కారమైన ‘గ్రాండ్‌ క్రాస్‌ ఆఫ్‌ ది లీజియన్‌ ఆఫ్‌ ఆనర్‌’ అవార్డుతో సత్కరించారు.


ఈ పరేడ్‌ అనంతరం.. మేక్రాన్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. సైనిక, వ్యూహాత్మక ఒప్పందాలు, ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభం, ఇండో-పసిఫిక్‌ ప్రాంత పరిస్థితులపై ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉంది. భారత నౌకాదళం కోసం 26 రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలుపై మోదీ కీలక ప్రకటన చేసే అవకాశముంది. రక్షణ, అంతరిక్ష, మౌలిక, సాంస్కృతిక రంగాలతోపాటు వివిధ విభాగాల్లో భారత్-ఫ్రాన్స్ బంధాల బలోపేతమే లక్ష్యంగా చర్చలు జరపనున్నారు.

Tags

Next Story