UAE: అబుదాబిలో అతిపెద్ద హిందూ దేవాలయం..

UAE: అబుదాబిలో అతిపెద్ద హిందూ దేవాలయం..
ఆలయం ప్రత్యేకతలివే ..

అయోధ్య రామ మందిరం ప్రారంభం తర్వాత భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నUAEలోని అతిపెద్ద హిందూ దేవాలయం ఆరంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. సుమారు 108 అడుగుల ఎత్తుతో 27 ఎకరాల్లో అబుదాబిలో నిర్మించిన ఈ మందిరాన్ని బుధవారం ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. భారతీయ శిల్పకళా సౌందర్యం ఉట్టిపడేలా బాప్స్‌ స్వామినారాయణ్‌ సంస్థ ఈ ఆలయాన్ని నిర్మించింది.

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో అతిపెద్ద హిందూ దేవాలయం భక్తులకు అందుబాటులోకి రానుంది. అబూ మురీఖాలో భారత శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడేలా ఆలయం రూపుదిద్దుకుంది. బోచ సన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్‌-బాప్స్ సంస్థ ఈ ఆలయాన్ని నిర్మించింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బుధవారం ఈ మందిరం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం కోసం ప్రధాని ఇప్పటికే UAE చేరుకున్నారు.


అబుదాబిలో బాప్స్ నిర్మించిన హిందూ ఆలయం పశ్చిమాసియాలోనే అతి పెద్దది. 108 అడుగులు ఎత్తు, 262 అడుగుల పొడవు,180 అడుగుల వెడల్పుతో ఆలయాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. అత్యంత క్లిష్టమైన రీతిలో ఫలకాలపై రామాయణం, శివపురాణం, భాగవతం, మహాభారతంతో పాటు పలు దేవుళ్ల కథలను వర్ణించారు. ఆలయ ప్రాంగణంలో సందర్శకుల కేంద్రాలు, ప్రార్థనా మందిరాలు,పిల్లల క్రీడా ప్రాంతాలు, ఉద్యానవనాలు, వాటర్‌ ఫీచర్లు, ఫుడ్ కోర్టులు, పుస్తకాలు ఉంటాయి. మందిర్ ఫౌండేషన్ పెద్ద సంఖ్యలో సెన్సార్లను ఏర్పాటు చేసింది. భూకంపం, ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు వంటి వాతావరణ మార్పులపై అవి నిరంతరం డేటాను సేకరిస్తాయి.

ఈ గుడిలో 402 స్తంభాలు ఉన్నాయి. ఒక్కో స్తంభంపై హిందూ దేవతామూర్తుల ప్రతిమలు, సంగీత వాయిద్యాలు వాయిస్తున్న విద్వాంసులు, నెమలి, ఏనుగు వంటి వన్యప్రాణుల చిత్రాలున్నాయి. మందిర నిర్మాణం కోసం రాజస్థాన్‌ నుంచి పింక్ స్టోన్స్‌, ఇటలీ నుంచి పాలరాయిని తెప్పించారు. మందిర రూపకల్పనలో 25 వేల టన్నుల రాళ్లను వాడారు.


ఇటలీ నుంచి తెప్పించిన పాలరాళ్లను తొలుత రాజస్థాన్‌లోని పలు గ్రామాలకు పంపించారు. సుమారు నాలుగేళ్ల పాటు 5 వేల మంది కళాకారులు...ఆలయంలోని ప్రతి భాగాన్ని చేతితో చెక్కారు.ఇందుకు కేవలం సుత్తి, ఉలిని మాత్రమే వాడారు. అలా రూపొందించిన విడి భాగాలను UAE లోని 150కి పైగా కళాకారులు రెండేళ్లుగా వాటిని ఒక దగ్గరకు పేర్చారు. జిక్సా పజిల్‌లో మాదిరిగా రాళ్లను కలిపి ఈ అద్భుత నిర్మాణాన్ని రూపొందించారు. మందిర రూపకల్పనలో ఎలాంటి ఇనుమును గానీ ఆ తరహా మరో పదార్థం గానీ వాడలేదు. హిందూ శాస్త్రాలకు అనుగుణంగా పూర్తి సహజంగా నిర్మితమైన ఈ మందిరం వెయ్యేళ్లకు పైగా చెక్కుచెదరకుండా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.


UAEలోని అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి ముందు అక్కడి పురోహితులు ప్రత్యేక యజ్ఞాలు నిర్వహించారు. ప్రపంచానికి ఐక్యతను, సామరస్యాన్ని చాటిచెప్పడమే ఈ దేవాలయం ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ ఆలయం నిర్మాణ ప్రారంభోత్సవం సమయంలో ప్రపంచం నలుమూలల నుంచి వివిధ మతాలకు చెందిన 60 వేల మంది శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు

Tags

Next Story