PM Modi Visit Al-Hakim Mosque: అల్ హకీం మసీదును సందర్శించిన ప్రధాని మోదీ

PM Modi Visit Al-Hakim Mosque: అల్ హకీం మసీదును సందర్శించిన ప్రధాని మోదీ
X

ప్రధాని మోదీ ఈజిప్టు పర్యటనలో రెండో రోజు బిజీబిజీగా గడిపారు. టూర్‌లో భాగంగా వెయ్యి ఏళ్ల చరిత్ర కలిగిన ప్రఖ్యాత అల్ హకీం మసీదును సందర్శించారు. మసీదుకు వెళ్లిన మోదీకి అక్కడ అధికారులు, మతపెద్దలు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత మసీదు కట్టడాలను క్షుణంగా పరిశీలించారు. మసీదు చరిత్ర అడిగి తెలుసుకున్నారు. అల్‌ హకీం మసీదు.. భారత్‌- ఈజిప్టు పంచుకున్న గొప్ప సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు.

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఈజిప్ట్‌, పాలస్తీనాల్లో ఉండి పోరాడి మరణించిన భారతీయ సైనికులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు . అమర జవాన్ల స్మారకాన్ని సందర్శించారు. అనంతరం ఈజిప్ట్‌ ప్రెసిడెంట్ అబ్దుల్‌ ఫతా ఎల్‌-సిసితో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. ఈ పర్యటన ఈజిప్టుతో బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందన్న నమ్మకం తనకుందన్నారు. ప్రధాని మోదీకి దేశ అత్యున్నతమైన ఆర్డర్ ఆఫ్‌ ది నైల్‌ అవార్డును ప్రధానం చేశారు ఈజిప్ట్‌ ప్రెసిడెంట్ అబ్దుల్ ఫతా.

రెండు దేశాల మధ్య వ్యాపార, ఆర్థిక అంశాలపై ప్రధాని మద్‌బౌలి నేతృత్వంలో ఏర్పాటైన ‘ఇండియా గ్రూప్‌’తో భారత ప్రధాని చర్చించారు. వాణిజ్యం, పెట్టుబడులు, పునరుత్పాదక ఇంధనం, గ్రీన్‌ హైడ్రోజన్‌, ఐటీ, డిజిటల్‌ పేమెంట్స్‌ వ్యవస్థ, ఫార్మా తదితర అంశాలపై చర్చలు జరిగాయి. ఆ దేశ ప్రముఖ ముఫ్తీ షాకీ ఇబ్రహీం అబ్దుల్‌-కరీం అల్లంను మోదీ కలిశారు. సామాజిక సామరస్యం, తీవ్రవాదంపై పోరు వంటి అంశాలపై చర్చించారు.

Tags

Next Story