Prime Minister: మోదీ దక్షిణాఫ్రికా ప్రయాణం

Prime Minister: మోదీ   దక్షిణాఫ్రికా ప్రయాణం
బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు..

బ్రిక్స్‌ దేశాల సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ దక్షిణాఫ్రికాకు బయలుదేరారు. దక్షిణాఫ్రికా అధ్యక్షతన ఆగస్టు 22-24 తేదీల్లో జోహన్నెస్‌బర్గ్‌లో జరగనున్న 15వ బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) సదస్సులో ఆయన పాల్గొననున్నారు.ఈ సదస్సుకు ముందు జోహన్నెస్‌బర్గ్‌లో ఉన్న కొంతమంది నాయకులతో ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొననున్నారు. ఈ సదస్సులో పాల్గొని విదేశాల అధినేతలతో సంభాషించడానికి ఎదురు చూస్తున్నానని మోదీ ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు సీ జిన్‌పింగ్‌, బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డసిల్వా దీనికి బయలుదేరి వెళుతుండగా, రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ ఆన్‌లైన్‌ ద్వారా ఈ సదస్సులో పాల్గొననున్నారు. మూడేళ్ళ తరువాత బ్రిక్స్‌ కూటమి అధినేతలు తొలిసారి కలవనున్నారు. ప్రపంచాన్నే వణికించిన కోవిడ్‌ మహమ్మారి ఈ బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశాలకు బ్రేక్‌ వేసింది. ఏటా ఒక అంశంపై చర్చించే ఈ సదస్సులో ఈసారి ‘బ్రిక్స్‌ అండ్‌ ఆఫ్రికా’ అనే ఎజెండాపై చర్చించనున్నారు. మోడీ బ్రిక్స్‌ సమావేశాల సందర్భంగా జిన్‌పింగ్‌తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.


దక్షిణాఫ్రికాలో ప్రధాని మోదీ మధ్యాహ్నం 3.55గంటలకు శాండ్టన్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ నాయకులతో ప్రధాని సంభాషిస్తారు. సాయంత్రం 6 గంటలకు లీడర్స్ రిట్రీట్ కోసం సమ్మర్ ప్లేస్‌కు చేరుకుంటారు. ఈ కార్యక్రమం తర్వాత దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా విందు ఇవ్వనున్నారు. బ్రిక్స్‌ సదస్సు అనంతరం ‘బ్రిక్స్‌-ఆఫ్రికా అవుట్‌రిచ్‌, బ్రిక్స్‌ ప్లస్‌ డైలాగ్‌’ అనే పేరిట జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. భారత్‌- దక్షిణాఫ్రికా దౌత్య సంబంధాలు ముఫ్పై ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రధాని పర్యటన విశేష ప్రాధాన్యత సంతరించుకుంది.

మోదీ అధికారంలోకి వచ్చాక ఈ దేశంలో ఆయన పర్యటించడం ఇది మూడోసారి. ఆగస్టు 25న, సదస్సు ముగిసిన మరుసటిరోజు గ్రీస్‌ దేశంలో మోదీ పర్యటిస్తారు.. దక్షిణాఫ్రికా నుంచి గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్ ఆహ్వానం మేరకు మోదీ ఆగస్టు 25వతేదీన గ్రీస్‌లోని ఏథెన్స్‌కు వెళతారు. తన గ్రీస్ పర్యటన ఆ దేశాల బహుముఖ సంబంధాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించగలదని ప్రధాని మోదీ చెప్పారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సాంస్కృతిక రంగాల్లో సహకారం మన రెండు దేశాలను మరింత దగ్గర చేస్తోందని మోదీ వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story