Killer whales: గడ్డ కట్టిన నీళ్ల నడుమ చిక్కిన కిల్లర్‌ వేల్స్‌.. చివరికి

Killer whales:  గడ్డ కట్టిన నీళ్ల నడుమ చిక్కిన కిల్లర్‌ వేల్స్‌.. చివరికి
X
వాటికవే తప్పించుకోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు

జపాన్‌లోని హక్కైడో తీరంలో మంచు ఫలకం మధ్య చిక్కుకుపోయిన కిల్లర్‌ వేల్స్‌ ఎట్టకేలకు అక్కడ నుంచి తప్పించుకున్నాయి. ఇవి మంచు ఫలకంలో చిక్కుకుని తలలను నీటి బయటపెట్టి భారంగా శ్వాస తీసుకుంటున్న దృశ్యాలు మంగళవారం పర్యావరణవేత్తలను కలచి వేశాయి. ఐతే బుధవారం ఉదయం ఆ ప్రదేశానికి వెళ్లి చూసే సరికి ఇవి అక్కడ నుంచి తప్పించుకున్నట్లు జపాన్‌ అధికారులు గుర్తించారు.

జపాన్‌లో ఇటీవల మొదలైన రికార్డు స్థాయి హిమపాతం అరుదైన కిల్లర్‌ వేల్స్‌కు ప్రాణాంతకంగా మారింది. ఉత్తర జపాన్‌లోని హక్కైడో తీరంలో గల రౌస్‌ అనే ప్రదేశానికి కిలోమీటరు దూరంలో గడ్డకట్టిన నీటి మధ్య చిన్న ఖాళీ ప్రాంతంలో 13 కిల్లర్‌ వేల్స్‌ చిక్కుకున్నాయి. ఇవి కదలడానికి చోటు లేకపోవడంతో.. తలలను నీటి బయటపెట్టి భారంగా శ్వాస తీసుకొన్నాయి. దీనికి సంబంధించిన దృశ్యాలను జపాన్‌కు చెందిన జాతీయ టెలివిజన్‌ ఛానెల్‌ ప్రసారం చేసింది. ఆ మూగజీవాలు గాలి ఆడక అవస్థ పడుతున్న తీరు చూసి పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. తొలుత మంచు ఫలకంలో కిల్లర్‌వేల్స్‌ చిక్కుకుపోయిన దృశ్యాలను చూసిన కొందరు మత్స్యకారులు అధికారులను అప్రమత్తం చేశారు. వారు అక్కడికి వెళ్లి డ్రోన్‌ ఫుటేజ్‌ ద్వారా 13 కిల్లర్‌వేల్స్‌ చిక్కుకుపోయినట్లు గుర్తించారు. ఆర్కాస్‌గా పిలిచే వీటిని రక్షించడం కోస్టుగార్డ్‌కు సవాలుగా మారింది. అక్కడ నీరు మొత్తం మందపాటి మంచుఫలకం వలే మారిపోవడమే అందుకు కారణం. ఐతే బుధవారం ఉదయం అధికారులు మరోసారి వెళ్లి చూసే సరికి కిల్లర్‌వేల్స్‌ అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు. మంచు ఫలకంలో ఖాళీలు పెరిగితే ఆర్కాస్‌ తమను తాము తప్పించుకోగలవని అధికారులు తెలిపారు.


2005లో రౌస్‌ సమీపంలోని మంచులో చిక్కుకుపోయి ఆర్కాస్‌ ప్రాణాలు కోల్పోయాయి. ఉత్తరార్ధ గోళంలో లోతట్టు ప్రాంతంగా హక్కైడోను భావిస్తుంటారు. గతంలో ఇక్కడ భారీగా మంచు గడ్డకట్టి ఉండేదని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన ఆ ప్రాంతంలో కిల్లర్‌ వేల్స్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏటా రౌస్‌ వద్దకు భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.

ఆర్కాస్‌ కూడా డాల్ఫిన్‌ కుటుంబానికి చెందినవే. కానీ, ఇవి మిగిలిన తిమింగలాల మాదిరిగా చిన్న చేపల్ని కాకుండా పెద్దచేపలు, పెంగ్విన్లను, సముద్రపు తాబేళ్లను, పక్షులను వేటాడి తింటాయి. శరీర నిర్మాణమూ, జీవన విధానాలకు సంబంధించి ఎన్నో విషయాల్లో తిమింగలాలు మనుషుల్ని పోలి ఉంటాయి. మనం ఒకసారి శ్వాస లోపలికి తీసుకుంటే అందులో 15 శాతం ఆక్సిజన్‌ను మాత్రమే శరీరం గ్రహించగలుగుతుంది. తిమింగలాలు అలా కాదు, అవి ఒక్క శ్వాస నుంచి 90 శాతం ఆక్సిజన్‌ను గ్రహిస్తాయి. అందుకే చాలాసేపు గాలి పీల్చకుండా నీటిలో ఉండిపోగలవు

Tags

Next Story