Joe Biden Son: కుమారుడికి క్షమాభిక్ష పెట్టిన అధ్యక్షుడు జో బైడెన్.

అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ క్రిమినల్ కేసుల్లో దోషిగా తేలిన తన కొడుకు హంటర్ బైడెన్‌కు క్షమాభిక్ష ప్రసాదించారు. ఈ మేరకు బైడెన్ ఆదివారం డిసెంబర్ 1, 2024న ప్రకటన జారీ చేశారు. జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ చట్ట వ్యతిరేకంగా తుపాకులు కలిగి ఉండడం, పన్ను ఎగువేత లాంటి కేసుల్లో దోషిగా తేలారు. మరో రెండు రోజుల్లో ఆయనకు కోర్టు శిక్ష ఖరారు చేయనుండగా అధ్యక్షుడు జో బైడెన్ క్షమాభిక్ష పెట్టారు.
అమెరికా అధ్యక్ష భవంనం జో బైడెన్ క్షమాభిక్ష గురించి జారీ చేసిన అధికారిక ప్రకటన ప్రకారం “ఈ రోజు నేను నా కుమారుడు హంటర్ క్షమాభిక్ష పిటీషన్‌ను ఆమోదించాను. నేను అధ్యక్ష పదవి చేపట్టిన రోజు నుంచి నేను న్యాయ శాఖ వ్యవహారాల్లో జోక్యం చేసుకోనని మాటిచ్చాను. కానీ నా కొడుకు కేసులో వివక్షపూరితంగా విచారణ సాగింది. హంటర్ కేసులను గమినిస్తే.. విచక్షణ ఉన్న ఏ వ్యక్తి కూడా అతడిపట్ల కేవలం నా కొడుకు కావడం వల్లే వివక్ష చూపారని అతడిని టార్గెట్ చేశారని అర్థం చేసుకోగలడు.
నాకు న్యాయ శాఖపై పూర్తి నమ్మకం ఉంది. అయితే రాజకీయాలు చాలా నీచ స్థితికి దిగజారాయి. ఇది న్యాయ వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతోంది. నన్ను బలహీనంగా చేయడానికి కొందరు నా కొడుకుని టార్గెట్ చేశారు. ఇదంతా నేను చాలా ఓర్పుగా చూశాను. కానీ దీనికి అంతం కనిపించడం లేదు. అందుకే నా పదవి అధికారాలను ఉపయోగించాల్సి వచ్చింది. అమెరికా ప్రజలు ఒక ప్రెసిడెంట్, ఒక తండ్రి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.” అని జో బైడెన్ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే గతంలో జో బైడెన్ తన కొడుకు దోషిగా తేలితే తాను ఎప్పటికీ క్షమించనని చెప్పడం గమనార్హ
హంటర్ పైన ఉన్న నేరారోపణలు ..
ఇంతకుముందు డ్రగ్స్ వ్యసనానికి బానిస అయిన హంటర్ బైడెన్.. 2018లో ఒక తుపాకీ కొనే సమయంలో తన గురించి పూర్తి వివరాలు ఇవ్వలేదు. డ్రగ్స్ అలవాటు ఉన్నవారికి తుపాకీ విక్రయించకూడదని నిబంధనులున్నాయి. దీంతో హంటర్ తనకు డ్రగ్స్ అలవాటు ఉందని చెప్పలేదు. ఈ కేసులో జూన్ 2024లో హంటర్ ని కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో డెలోవేర్ కోర్టు డిసెంబర్ 4న శిక్ష విధించబోతుండగా ఆయనకు క్షమాభిక్ష లభించింది. ఈ కేసులో హంటర్ కు గరిష్టంగా 25 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే ఇదే ఆయన తొలినేరం కావడంతో శిక్ష కనీసం 12 నుంచి 16 నెలలు పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు తెలిపారు.
ట్యాక్స్ దొంగతనం – పన్ను ఎగవేత కేసు
హంటర్ బైడెన్ పై పన్ను ఎగవేత కేసులు కూడా ఉన్నాయి. సెప్టెంబర్ 2024లో ఆయన తన నేరాలను అంగీకరించారు. 2016- 2019 కాలంలో హంటర్ ట్యాక్స్ చెల్లించలేదని.. ఈ నాలుగు సంవత్సరాలలో మొత్తం ఆయన 14 లక్షల డాలర్లు (రూ.11.84 కోట్లు) పన్ను చెల్లించలేదు. ఇదే సమయంలో ఆయన డ్రగ్స్, వ్యభిచారం, ఇతరత్రా విలాసాలకు డబ్బు తీవ్రంగా ఖర్చు పెట్టారని సమాచారం. ఈ కేసులో ఆయనకు క్యాలిఫోర్నియా కోర్టు డిసెంబర్ 16న 15 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉండగా ఆయన తండ్రి జో బైడెన్ క్షమాభిక్ష పెట్టారు.
ట్రంప్ మండిపాటు
కుమారుడికి క్షమాభిక్ష పెట్టడంతో జో బైడెన్ తన అధ్యక్ష అధికారాలను దుర్వినియోగం చేశారని.. తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఇది న్యాయాన్ని అణచివేయడంతో సమానమని ఆయన అభిప్రాయపడ్డారు. జైళ్లలో ఖైదీలుగా ఉన్న జె -6 కేసు నేరస్తులకు కూడా బైడెన్ ఇలాగే క్షమాభిక్ష ఎందుకు ప్రసాదించలేదు అని ట్రంప్ ప్రశ్నించారు. జె-6 కేసు అంటే 2021లో అధ్యక్ష ఎన్నికల్లో మోసపూరితంగా ట్రంప్ ను ఓడించారిన ఆయన అనుచరులు హింసకు పాల్పడ్డారు. ఆ కేసుని జె-6 గా పిలుస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com