Aseefa Bhutto: పాక్ ప్రథమ మహిళగా అసీఫా భుట్టో

పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాక్ మీడియా కథనాల ప్రకారం, ఆ దేశ ప్రథమ మహిళగా జర్దారీ తన కుమార్తె అసీఫా భుట్టో ని అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. సాధారణంగా దేశాధ్యక్షుని సతీమణి ఆ దేశ ప్రథమ మహిళ అవుతారు. అయితే ఆయన సతీమణి బెనజీర్ భుట్టో 2007లో హత్యకు గురైన తర్వాత ఆయన పునర్వివాహం చేసుకోలేదు. 2008-2013 మధ్య కాలంలో కూడా జర్దారీ దేశాధ్యక్ష పదవిని నిర్వహించారు. అప్పుడు దేశ ప్రథమ మహిళ హోదాను ఎవరికీ ఇవ్వలేదు. ఈసారి మాత్రం తన కుమార్తె అసీఫాను దేశ ప్రథమ మహిళగా గుర్తించాలని ఆయన నిర్ణయించుకున్నారు.
పెద్ద కుమార్తె భక్తావర్ భుట్టో తాజాగా సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్ట్ చేస్తూ.. న్యాయస్థానంలో విచారణలు, న్యాయపోరాటం దగ్గరి నుంచి జర్దారీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆయనకు పాక్ ప్రథమ మహిళ ఆసిఫా వెన్నంటే నిలిచిందని చెప్పారు. ఆసిఫా భుట్టోను ఆమె ప్రథమ మహిళగా పేర్కొంటూ పోస్ట్ చేయడం గమనార్హం.
రాజకీయాల్లోకి ఆసిఫా 2020 నుంచి చురుకుగా ఉంటున్నారు. ఆత్మాహుతి దాడిలో మరణించి పాకిస్థాన్ తొలి మహిళా ప్రధాని బెనజీర్ భుట్టో కుమార్తె ఆసిఫా. భుట్టో-జర్దారీ కుటుంబంలో ఆసీఫా అంచెలంచెలుగా ఎదిగారు. అధ్యక్షుడు జర్దారీకి కొడుకు బిలావల్, కుమార్తెలు భక్తవర్, అసీఫా ఉన్నారు. ఆసీఫా రాజకీయాల వైపు మొగ్గు చూపింది. పాకిస్థాన్ విదేశాంగ మంత్రిగా కొంతకాలం ఆసిఫా సోదరుడు బిలావల్ పనిచేశారు. అతడి కంటే తన సోదరి భక్తవర్ కంటే ఆసిఫా భుట్టో తన తండ్రితో ఎక్కువగా కనపడతారు. రాజకీయ ప్రసంగాలు, ర్యాలీలలో చురుకుగా పాల్గొన్నారు, పీపీపీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు.
పాకిస్థాన్‌లో పోలియో నిర్మూలన అంబాసిడర్‌గానూ ఆసిఫా ఉన్నారు. 2022లో ఖనేవాల్‌లో పీపీపీ ఊరేగింపు సందర్భంగా ఆసిఫా తన సోదరుడు బిలావల్‌తో కలిసి వెళుతుండగా మీడియా డ్రోన్ ఢీకొట్టింది. ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే చికిత్స తీసుకుని కోలుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com