TITAN: తీరానికి టైటాన్‌.. మానవ అవశేషాలు లభ్యం

TITAN: తీరానికి టైటాన్‌.. మానవ అవశేషాలు లభ్యం
X
తీరానికి చేరిన టైటాన్‌ సబ్‌మెరైన్‌ శకలాలు... మానవ అవశేషాలు స్వాధీనం... దర్యాప్తులో కీలక పరిణామం...

అట్లాంటిక్‌ మహా సముద్రం అగాథంలో టైటానిక్‌ నౌక శిథిలాలను చూసేందుకు వెళ్లి పేలిపోయిన టైటాన్‌ జలాంతర్గామి శకలాలు తీరాన్ని చేరాయి. కెనడాలోని న్యూఫౌండ్‌లాండ్‌ అండ్‌ లాబ్రడార్‌ ప్రావిన్సులో సెయింట్‌ జాన్స్‌ ఓడరేవుకు టైటాన్‌ మినీ జలాంతర్గామీ శిథిలాలను తీసుకొచ్చారు. అతికష్టం మీద శకలాలను బయటకు తెచ్చినట్లు అమెరికా తీర రక్షణ దళం అధికారికంగా ప్రకటించింది. భారీ సైజులో ఉండే టైటాన్‌ సబ్‌ను అతికష్టం మీద బయటకు తెచ్చామని వెల్లడించింది. న్యూయార్క్‌కు చెందిన పెలాజిగ్‌ రీసెర్చ్‌ కంపెనీ ఈ శకలాలను గుర్తించి బయటకు తెచ్చింది.





అట్లాంటిక్‌లో నీటమునిగిన టైటానిక్‌ పడవ ముందుభాగంలో 16 వందల అడుగుల వద్ద టైటాన్‌ కూరుకుపోయినట్లు గుర్తించి... వాటిని బయటకు తీశారు. శకలాలను బయటకు తీయగానే.. అది తన ఆపరేషన్‌ ముగిసినట్లు ప్రకటించింది. కెనడాలోని న్యూఫౌండ్ లాండ్ అండ్ లాబ్రడార్ ప్రావిన్సులో సెయింట్ జాన్స్ ఓడరేవుకు బుధవారం టైటాన్‌ జలాంతర్గామి శిథిలాలను తీసుకొచ్చినట్లు యూఎస్ తీర రక్షణ దళం అధికారులు వెల్లడించారు. అతిజాగ్రత్తగా బయటకు తీసిన శకలాల నుంచి మానవ అవశేషాలను బయటకు తీశారని, వాటిని వైద్య పరిశోధకులు పరిశీలిస్తారని అమెరికా కోస్ట్‌గార్డ్‌ ప్రకటించింది. తద్వారా ప్రమాదం జరిగిన తీరు.. వాళ్లెలా చనిపోయారనేదానిపై ఓ అంచనానికి రావొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే కెనడా అధికారులు మాత్రం శకలాల వెలికితీత అంశంపై ఇంతవరకూ స్పందిచలేదు.





అట్లాంటిక్‌ మహా సముద్రంలో టైటానిక్‌ పడవ సందర్శనం కోసం జూన్‌ 18వ తేదీ ప్రారంభమైన టైటాన్‌ ప్రయాణం.. కాసేపటికే విషాదంగా ముగిసింది. తీవ్ర ఒత్తిడితో ఈ మినీ జలంతర్గామి పేలిపోగా.. అందులోని ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. నాలుగు రోజుల తర్వాత టైటాన్‌ ప్రమాదంపై యూఎస్‌ కోస్ట్‌గార్డ్‌ అధికారికంగా ప్రకటన చేసింది. బ్రిటిష్‌ సాహసికుడు హమీష్‌ హర్దింగ్‌, ఫ్రెంచ్‌ సబ్‌మెరిన్‌ ఎక్స్‌పర్ట్‌ పాల్‌ హెన్రీ, పాక్‌-బ్రిటిష్‌ బిలియనీర్‌ షాహ్‌జాదా దావూద్‌.. ఆయన తనయుడు సులేమాన్‌, ఓషన్‌గేట్‌ సీఈవో స్టాక్‌టన్‌ రష్‌ ఈ ప్రమాదంలో మరణించారు. టైటానిక్‌ సమీపంలోనే టైటాన్ మిస్సైన కొద్ది సేపటికే అది పేలిపోయినట్లు యూఎస్ నేవీ గుర్తించింది. ఈ ఘటనపై అమెరికా కోస్ట్‌ గార్డు ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. జలాంతర్గామి పేలిపోవడానికి కారణాలేంటో తెలుసుకునేందుకు టైటాన్‌ మినీ సబ్‌మెరైన్‌ శకలాలు కీలక ఆధారాలు అందిస్తాయని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.

Tags

Next Story