Prince Andrew: లైంగిక ఆరోపణల నేపథ్యంలో సోదరుడిని ఇంటి నుంచిగా గెంటేసిన బ్రిటన్ రాజు!

బ్రిటన్ రాజకుటుంబంలో సంచలనం చోటుచేసుకుంది. లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో తీవ్ర వివాదంలో చిక్కుకున్న తన సోదరుడు ప్రిన్స్ ఆండ్రూపై బ్రిటన్ రాజు చార్లెస్ III కఠిన చర్యలు తీసుకున్నారు. ఆండ్రూకు ఉన్న అన్ని రాచరిక బిరుదులను రద్దు చేయడంతో పాటు, విండ్సర్ ప్యాలెస్‌లోని ఆయన నివాసాన్ని తక్షణమే ఖాళీ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు బకింగ్‌హామ్ ప్యాలెస్ గురువారం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఈ నిర్ణయంతో ఆండ్రూ ఇకపై 'ప్రిన్స్' అనే గౌరవాన్ని కోల్పోనున్నారు. ఆయన్ను కేవలం ఆండ్రూ మౌంట్‌బాటన్ విండ్సర్‌గా మాత్రమే పిలవాల్సి ఉంటుంది. ఎప్‌స్టీన్‌తో ఆండ్రూ సంబంధాలపై రాజకుటుంబం కొన్నేళ్లుగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఎప్‌స్టీన్ బాధితుల్లో ఒకరైన వర్జీనియా రాబర్ట్స్ గిఫ్రే చేసిన లైంగిక ఆరోపణలతో ఈ వివాదం మరింత ముదిరింది. ఇటీవల బయటపడిన ఈ-మెయిల్స్ ప్రకారం, తాను చెప్పినదానికంటే ఎక్కువ కాలం ఆండ్రూ.. ఎప్‌స్టీన్‌తో సంబంధాలు కొనసాగించినట్లు తేలడంతో ఆయనపై వ్యతిరేకత పెరిగింది.
"ఆండ్రూ తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నప్పటికీ, ఆయన తీర్పులో తీవ్రమైన లోపం ఉందని భావించి ఈ చర్యలు అవసరమని నిర్ణయించాం" అని బకింగ్‌హామ్ ప్యాలెస్ తమ ప్రకటనలో పేర్కొంది. లైంగిక వేధింపుల బాధితులు, ప్రాణాలతో బయటపడినవారికి తమ ప్రగాఢ సానుభూతి ఎల్లప్పుడూ ఉంటుందని రాజు, రాణి స్పష్టం చేశారు.
2019లో బీబీసీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనపై వచ్చిన ఆరోపణలను ఖండించే ప్రయత్నం చేసి ఆండ్రూ అభాసుపాలయ్యారు. ఆ తర్వాత రాచరిక విధులకు దూరంగా ఉన్నారు. 2022లో గిఫ్రే న్యూయార్క్‌లో దాఖలు చేసిన సివిల్ దావాలో ఆండ్రూ కోర్టు బయట మిలియన్ల డాలర్లు చెల్లించి సెటిల్‌మెంట్ చేసుకున్నారు. ఆ సమయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పినప్పటికీ, లైంగిక వేధింపుల బాధితురాలిగా ఆమె పడిన బాధను గుర్తించారు. కాగా, గిఫ్రే (41) ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆత్మహత్య చేసుకున్నారు.
తాజా ఆదేశాలతో ఆండ్రూ.. రాజుకు చెందిన శాండ్రింగ్‌హామ్ ఎస్టేట్‌లోని ఓ ప్రైవేట్ నివాసానికి మారే అవకాశం ఉంది. ఆయనకు సోదరుడి నుంచి వ్యక్తిగత ఆర్థిక సహాయం అందనుంది. 30 గదుల విలాసవంతమైన భవంతిలో ఆండ్రూతో నివసిస్తున్న ఆయన మాజీ భార్య సారా ఫెర్గూసన్ కూడా కొత్త నివాసాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

