Karnataka bandh: కావేరి నీటి విడుదలపై.. రాష్ట్ర బంద్

Karnataka bandh: కావేరి నీటి విడుదలపై.. రాష్ట్ర బంద్
మూతబడిన విద్యాసంస్థలు.. రోడ్డెక్కని ఆటోలు, ట్యాక్సీలు

తమిళనాడుకు కావేరీ జలాలు విడుదల చేయడాన్ని నిరసిస్తూ కన్నడ అనుకూల సంస్థలు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో అప్రమ్తతమైన పోలీసులు భారీ భద్రతా ఏఏర్పాట్లు చేస్తున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో వివిధ సంస్థలకు చెందిన 50 మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో రవాణా వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. బెంగళూరులో విద్యాసంస్థలు, హోటళ్లు, ప్రైవేటు కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, థియేటర్లు సహా ఏవీ తెరుచుకోలేదు. ట్యాక్సీ, ఆటో సర్వీసులు కూడా నిలిచిపోయాయి. నగరంలో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. బంద్ పిలుపు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారు. కర్ణాటక రక్షణ వేదిక, కన్నడ చలవలి, కన్నడ ఒక్కట..ఉదయం నుంచి నిరసనలు తెలపాలని పిలుపునిచ్చింది. బంద్ కారణంగా రవాణాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.


కర్ణాటక నుండి తమిళనాడుకు యథావిధిగా బస్సులు నడుస్తాయని చెప్పారు. ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ ఈ బంద్‌కు మద్దతు ప్రకటించాయి. హైవేలు, టోల్‌గేట్లు, రైలు సర్వీసులు, విమానాశ్రయాల వద్ద నిరసనకారులు అడ్డుకునే ప్రమాదం ఉండడంతో ఆయాచోట్ల పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువారం అర్ధరాత్రి 12 గంటల నుంచి శుక్రవారం అర్థరాత్రి 12 గంటల వరకు బెంగళూరు నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, దీంతో పాటు బంద్ సందర్భంగా ఎలాంటి బహిరంగ సభలు, సమావేశాలకు అనుమతి లేదని, నిరసనల సందర్భంగా ప్రజల ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లితే ఆ నష్టానికి నిరసనకు పిలుపునిచ్చిన వారిదే బాధ్యత వహించాలని బెంగళూరు నగర పోలీసు కమీషనర్ దయానంద్ హెచ్చరించారు.


ప్రజాప్రతినిధులు పలు ప్రాంతాల్లోని దుకాణాలను మూసివేయించిన తరువాత ఇతర వాహనాలను రోడ్డుపై అడ్డగించినా, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినా వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని దయానంద్ హెచ్చరించారు. పౌరులకు ఏమైనా ఇబ్బందులు కలిగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు.

మరోవైపు కర్ణాటక బంద్ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తమిళనాడు డీజీపీ శంకర్ జివాల్ సరిహద్దు జిల్లాలైన కృష్ణగిరి, ధర్మపురి, సేలం, ఈరోడ్, నీలగిరి జిల్లాల పోలీసు సూపరింటెండెంట్‌లను ఆదేశించారు. సీనియర్ అధికారుల నేతృత్వంలో చెక్‌పోస్టుల వద్ద భద్రతను పెంచాలని సూచించారు.



Tags

Read MoreRead Less
Next Story