మరో కీలక నిర్ణయం తీసుకున్న డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వాషింగ్టన్‌లో రెండు వారాల పాటు ఎమర్జెన్సీ విధించారు. జనవరి 24 వరకు ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి ఉండనుంది. వారం రోజుల క్రితం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా ట్రంప్ మద్దతుదారుల క్యాపిటల్ హిల్ బిల్డింగ్ మీద దాడి చేయడమే కాక ప్రభుత్వ ఆస్తులను నాశనం చేశారు. ఈ నేపథ్యంలో నూతన అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాణ స్వీకారం సమయంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా.. ముందు జాగ్రత్తగా చర్యగా ట్రంప్ వాషింగ్టన్‌లో ఎమర్జెన్సీ విధించారని వైట్‌హౌస్ ప్రెస్ ఆఫీస్ వెల్లడించింది.
ఈ నిర్ణయం వెలువడిన వెంటనే వాషింగ్టన్‌లో అత్యవసర పరిస్థితుల వల్ల స్థానిక జనాభాకు కలిగే కష్టాలను, బాధలను తగ్గించడం కోసం విపత్తు సహాయక చర్యలను సమన్వయం చేయడం వంటి బాధ్యతలన్నీ ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ, హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం పర్యవేక్షిస్తోంది. ఈ అత్యవసర సహాయ చర్యలకు అవసరమైన నిధులను ఫెడరల్ ప్రభుత్వమే 100 శాతం అందిస్తోంది.
జో బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా ట్రంప్ మద్దతుదారులు జనవరి 20న మొత్తం 50 రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తోన్నట్లు ఎఫ్‌బీఐ హెచ్చరికలు జారీ చేసింది. పెంటగాన్ వాషింగ్టన్ సిటీలో మరోసారి దాడులు జరగకుండా చూడాలనే ఉద్దేశంతో క్యాపిటల్ సిటీలో 15 వేల మంది జాతీయ భద్రతా దళాలను మోహరించింది.
డొనాల్డ్ ట్రంప్ విషయంలో ట్విట్టర్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రంప్‌నకు అనుకూలంగా ఉన్నా 70 వేల ఖాతాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ట్రంప్ అధికారిక ఖాతాను శాశ్వతంగా నిషేధించిన ట్విట్టర్.. తాజాగా ఆయన మద్దతుదారుల అకౌంట్‌లను కూడా నిలిపివేసింది. ఇక ట్రంప్ అనుకూల పోస్టులపై ఫేస్‌బుక్ చర్యలు తీసుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com