Bharat-Canada: కెనడా-భారత్‌ల మధ్య ఉద్రిక్తల వేళ.. మరో హత్య

ఖలిస్థానీ అంశంలో భారత్, కెనడా మధ్య ఇప్పటికే ఉద్రిక్తలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్, కెనడా మధ్య వివాదం రాజుకున్న వేళ మరో ఘటన చోటుచేసుకుంది. కెనడాలో మరో ఖలిస్థానీ సానుభూతిపరుడు హత్యకు గురైనట్లు తెలుస్తోంది. విన్నిపెగ్‌లో బుధవారం ప్రత్యర్థి గ్యాంగ్ జరిపిన దాడిలో గ్యాంగ్‌స్టర్ సుఖ్‌దోల్ సింగ్ అలియాస్ సుఖా దునెకే మరణించినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
భారత్‌తో కయ్యానికి దిగే దేశాలు అంటే ప్రధానంగా వినిపించే పేర్లు పాకిస్థాన్, చైనా. అవకాశం దొరికితే చాలు ఏదొక రూపంలో గిల్లికజ్జాలు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉంటాయి. ఆ 2 దేశాల అంత ప్రమాదకరం కాకున్నా ఇప్పుడు కెనడా కూడా ఆ జాబితాలో చేరింది. రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ భగమంటున్నాయి. ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత్ హస్తం ఉందని స్వయంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలే ఈ ఉద్రిక్తతలకు కారణం. దీనిపై దర్యాప్తునకు భారత్ సహకరించాలని కోరారు కూడా. అయితే భారత్‌లో మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఓ ఉగ్రవాదికి కెనడా ప్రధాని స్వయంగా వత్తాసు పలకడం ఆషామాషీగా జరిగింది ఏమీ కాదు. సొంత దేశంలో లెక్కకు మిక్కిలి రాజకీయ ప్రయోజనాలు దీని వెనక దాగి ఉన్నాయి. పదవి అనే కాంక్ష ఇమిడి ఉంది. కెనడాలో గణనీయ సంఖ్యలో నివాసం ఉంటూ....తమ పదవిని కాపాడడంలో కీలక పాత్ర పోషించే సిక్కుల ఓట్లు నష్టపోవద్దనే ప్రయోజనాలు ఉన్నాయి.
కెనడా పార్లమెంటు హౌస్ ఆఫ్ కామన్స్‌లో 338 స్థానాలు ఉండగా ట్రూడో ప్రాతినిధ్యం వహిస్తున్న లిబరల్ పార్టీ 2021లో జరిగిన ఎన్నికల్లో 150స్థానాలు దక్కించుకుంది. అంతకు ముందు 177 స్థానాలు ఉండగా ఆ పార్టీ 27 సీట్లు కోల్పోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు తగ్గిపోవడంతో లిబరల్ పార్టీ 24 స్థానాలు సంపాదించిన జగ్మీత్‌సింగ్ ధాలివాల్ నేతృత్వం లోని నేషనల్ డెమొక్రటిక్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ పార్టీ నాయకులు ఇప్పటికే అనేక సార్లు ఖలిస్థాన్ వేర్పాటువాదులకు, వారి అజెండాకు మద్దతు పలికారు. 2013లో జగ్మీత్‌కు భారత్‌కు వీసా కూడా తిరస్కరించింది. ఈయన ఖలిస్థాన్ వేర్పాటువాదానికి మద్దతు పలకడమే కాదు జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించారు. అలాంటి వ్యక్తి నాయకత్వంలోని పార్టీ.. ట్రూడో ప్రభుత్వానికి ఊపిరి అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన మెప్పు పొందేందుకే ట్రూడో.. ఖలిస్థాన్ వేర్పాటువాదులకు మద్దతు ఇస్తూ భారత్‌పై నోరు పారేసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com