వాగ్నర్ గ్రూప్‌ది తీరని ద్రోహం: పుతిన్
రష్యా ప్రభుత్వాన్ని వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ పడగొట్టడానికి ప్రయత్నంచడంపై అధ్యక్షుడు పుతిన్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుగుబాటు జెండా ఎగరేసి వాగ్నర్ గ్రూప్... దేశానికి, దేశభక్తులకు తీరని ద్రోహం చేసిందని పుతిన్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుగుబాటు చల్లారిన తర్వాత తొలిసారి రష్యా అధ్యక్షుడు పుతిన్ టీవీలో ప్రజలకు బహిరగం సందేశం ఇచ్చారు. వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటును ద్రోహం, వెన్ను పోటుగా అభివర్ణించిన పుతిన్.. ఆ గ్రూప్‌లో చాలామంది యోధులు రష్యా దేశభక్తులని అన్నారు. వాగ్నర్ సభ్యులు నేటి నుంచి రక్షణశాఖ కాంట్రాక్టు ద్వారా రష్యా సైన్యం, ఇతర ప్రభుత్వ సంస్థల్లో చేరవచ్చని.... లేదా కుటుంబ సభ్యులు, ఆత్మీయల వద్దకు వెళ్లవచ్చని.... ఎవరైనా కోరుకుంటే బెలారస్ కూడా వెళ్లవచ్చని పుతిన్ మరోసారి ఆఫర్ ఇచ్చారు.
రష్యాలో అంతర్గత ఘర్షణలతో రక్తపాతం చోటు చేసుకోవాలని పశ్చిమ దేశాలు, ఉక్రెయిన్ కోరుకొన్నాయని పుతిన్ ఆరోపించారు. రక్తపాతం నివారించేందుకు చర్యలు తీసుకొన్నానని పుతిన్ అన్నారు. ఈ క్రమంలో వాగ్నర్ సభ్యులకు క్షమాభిక్షను ప్రసాదించానని వివరించారు. వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు మొదలైనప్పటి నుంచి రక్తపాతం నివారించే దిశగానే తన చర్యలు ఉన్నాయని పుతిన్ అన్నారు. రష్యన్లు తమ సోదరులను చంపుకోవడమే పశ్చిమ దేశాలకు, కీవ్‌లోని నియో నాజీలకు, దేశ ద్రోహులకు కావాలని పుతిన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారు రష్యా సైనికులు పరస్పరం ప్రాణాలు తీసుకోవాలని కోరుకున్నారని అన్నారు. రష్యాలో సంక్షోభానికి చేసే ప్రయత్నమైనా, బెదిరింపులైనా చివరకు విఫలమవుతాయని రష్యన్లు నిరూపించారని పుతిన్ కొనియాడారు.
ఈ కుట్రకు కారకులపై చట్టప్రకారం చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. ఈ ప్రసంగంలో ప్రిగోజిన్ పేరును ఎక్కడా పుతిన్ ప్రస్తావించలేదు. మరోవైపు రష్యాపై తాము చేసిన తిరుగుబాటు.. పుతిన్ సర్కారును కూలదోయడానికి కాదని వాగ్నర్ గ్రూపు అధిపతి ప్రిగోజిన్ స్పష్టంచేశారు. ఉక్రెయిన్‌పై దండయాత్ర ఎలా కొనసాగాలో చెప్పి, నిరసన వ్యక్తం చేయడమే తమ ఉద్దేశమని చెప్పారు. అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ప్రిగోజిన్ సోమవారం తొలిసారిగా టెలిగ్రామ్ యాప్‌లో 11 నిమిషాల నిడివి ఉన్న వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని అసమర్థ రీతిలో రష్యా కొనసాగిస్తోందనీ, దానిపై నిరసనగానే మాస్కోకు బయల్దేరామని తాజా సందేశంలో ఆయన తెలిపారు. పుతిన్‌పై వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటును వారి అంతర్గత విషయంగా అమెరికా పేర్కొంది. తిరుగుబాటుతో తమకు ఎలాంటి సంబంధం లేదని అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. రష్యాలో పరిపాలన పట్టాలు తప్పిందనేందుకు ఇదే నిదర్శనమని బ్రిటన్ పేర్కొంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com