Putin : ప్రియురాలిని 111 సార్లు పొడిచి హత్య చేసిన వ్యక్తికి పుతిన్ క్షమాభిక్ష..
ప్రియురాలిపై అత్యాచారం చేసి.. అత్యంత పాశవికంగా 111 సార్లు కత్తితో పొడిచి చంపిన యువకుడికి రష్యా అధ్యక్షుడు పుతిన్ క్షమాభిక్ష పెట్టారు. బ్రేకప్ చెప్పిందని గర్ల్ ఫ్రెండ్‌ను ఆ యువకుడు చిత్రహింసలు పెట్టాడు. మూడున్నర గంటలపాటు వేధించాడు. రేప్ చేశాడు. 111 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. అంతటి క్రూరుడికి రష్యా అధ్యక్షుడు క్షమాభిక్ష ప్రసాదించి ఉక్రెయిన్ యుద్ధానికి పంపించాడు.
రష్యా కొన్నాళ్లుగా ఉక్రెయిన్ పై సైనిక దాడులు నిర్వహిస్తోంది. సైన్యంతో పాటు వాగ్నర్ గ్రూప్, జైళ్లలో ఉన్న ఖైదీలను కూడా రష్యా యుద్ధం కోసం వినియోగిస్తోంది. ఖైదీల్లో తుపాకీ పట్టుకోగల సామర్థ్యం ఉన్నవారిని గుర్తించి వారిని యుద్ధరంగంలోకి పంపుతోంది. యుక్రెయన్ పై రెండేళ్ల నుంచి యుద్ధాన్ని కొనసాగిస్తూ ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతను చవి చూస్తున్న పుతిన్.. ప్రియురాలిని అత్యంత దారుణంగా చంపిన వ్యక్తికి క్షమాభిక్ష పెట్టి రష్యన్ ప్రజల నుంచి వ్యతిరేకతను కూడా మూటకట్టుకున్నారు. తన బిడ్డను అత్యంత దారుణంగా చంపిన వ్యక్తికి క్షమాభిక్ష పెట్టడంపై మృతురాలి తల్లి తీవ్రంగా మండిపడుతున్నారు.
రష్యా ప్రభుత్వ నిర్ణయంతో యుద్ధక్షేత్రంలోకి అడుగుపెట్టినవారిలో వ్లాదిస్లావ్ కాన్యుస్ ఒకడు. అతడు తన ప్రియురాలిని హత్య చేసిన కేసులో 17 ఏళ్ల జైలుశిక్షకు గురయ్యాడు. యుద్ధంలో దేశం కోసం పోరాడేందుకు సంసిద్ధత చూపడంతో అతడికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ క్షమాభిక్ష ప్రకటించారు. దాంతో అతడు శిక్ష పడిన ఏడాదికే జైలు నుంచి విడులదయ్యాడు.
అయితే, పుతిన్ నిర్ణయం తీవ్ర విమర్శలపాలైంది. దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. కేసు వివరాల్లోకి వెళితే వ్లాదిమిర్ కాన్యుస్, వేరా పెక్తెలేవా కొన్నాళ్లు ప్రేమించుకున్నారు. కానీ, ఆమె బ్రేకప్ చెప్పింది. దీంతో కాన్యుస్ ఆమెను చంపేయాలని అనుకున్నాడు. తొలుత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం మూడున్నర గంటల పాటు క్రూరంగా హింసించాడు. ఈ క్రమంలో ఆమెను 111 సార్లు కత్తితో పొడిచి చంపాడు. చివరికి ఆ కేసులో కాన్యుస్‌కు కఠిన శిక్ష పడింది. కానీ, కాన్యుస్ జైలు నుంచి విడుదలై కదనరంలో ఉన్నట్టు వేరా తల్లి ఓక్సానా తెలుసుకుంది. మిలిటరీ యూనిఫామ్‌లో ఓ ఆయుధాన్ని చేతపట్టుకుని కాన్యుస్ ఫొటోను చూసి ఆమె నిర్ఘాంతపోయింది. ఇది దారుణం. నా బిడ్డ సమాధిలో కరిగిపోతున్నది. నాకంటూ ఏమీ లేకుండా పోయింది. నా జీవితం, నా ఆశ నా బిడ్డే. నేను ఇప్పుడు జీవించడం లేదు. ప్రాణాలతో ఉన్నాను అంటే. ఇది నన్ను లోలోపల చంపేసింది. నేను చాలా దృఢమైన వ్యక్తిని కానీ, ఈ చట్ట రహిత అరాచక రాజ్యంలో చట్టాలేమీ సరిగ్గా అమలు కాకపోవడం నన్ను కుంగదీస్తున్నది. ఇప్పుడేం చేయాలే నాకు తెలియట్లేదు’ అని ఒక్సానా ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి కిరాతకుడికి క్షమాభిక్ష పెట్టడం సరైన నిర్ణయమేనా అంటూ అటు పుతిన్ ను మహిళా హక్కుల కార్యకర్తలు నిలదీస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com