New year 2024: బాణసంచా, డ్రోన్ ప్రదర్శనలతో రికార్డు సృష్టించిన రస్ అల్ ఖైమా , అబుదాబి రికార్డు
ఎప్పటిలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అత్యంత ఘనంగా న్యూ ఇయర్‌ను ఆహ్వానించారు. రస్ అల్ ఖైమాహ్ పట్టణంలోని సముద్ర తీరంలో కల్లుమిరిమిట్లు గొలిపేలా బాణా సంచ, డ్రోన్ల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సాంకేతికత సాయంతో కనీవినీ ఎరుగని షోలు నిర్వహించారు. ఈసారి రస్ అల్ ఖైమాహ్ రెండు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించుకుంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని రస్ అల్ ఖైమాహ్‌లో అత్యంత ఘనంగా జరిగిన నూతన సంవత్సర వేడుకలు సందర్శకులను కట్టిపడేశాయి. వరుసగా ఐదో సంవత్సరం బాణాసంచా ప్రదర్శనతో ఒకేసారి 2 విభాగాల్లో రస్ అల్ ఖైమాహ్.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.
లాంగెస్ట్ చైన్ ఆఫ్ ఆక్వాటిక్ ఫ్లోటింగ్ ఫైర్‌వర్క్స్ విభాగంలో భాగంగా 5.8 కిలోమీటర్ల పొడవునా.. తారాజువ్వలతో అద్భుతమైన ప్రదర్శన జరిగింది. నింగిలోకి దూసుకెళ్లిన తారాజువ్వలు రంగురంగుల కాంతులతో మిరుమిట్లు గొలిపాయి. ఏకకాలంలో అల్‌మర్జాన్ దీవి నుంచి అల్‌హమ్రా విలేజ్ వరకు 8 నిమిషాల పాటు ఫ్లోటింగ్ ఫైర్‌వర్క్స్ ప్రదర్శన జరిగింది. విమానాల సాయంతో ఫైర్‌వర్క్స్‌ను మండించడం గమనార్హం.లాంగెస్ట్ స్ట్రేట్ లైన్ డ్రోన్ డిస్‌ప్లే విభాగంలో వెయ్యికి పైగా ఎల్యీడీ డ్రోన్లతో ప్రదర్శన నిర్వహించారు. 2 కిలోమీటర్ల మేర ఈ అద్భుతమైన షోను నిర్వహించారు. ప్రదర్శనలకు అనుగుణంగా సంగీతం వినిపించడం సందర్శకులను అమితంగా ఆకట్టుకుంది.
50వేల మందికి పైగా ఈ అద్భుత దృశ్యాన్ని ప్రత్యక్షంగా తిలకించినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతీసారి కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా ఇక్కడ భారీ షోలు ఏర్పాటు చేస్తారు. ఈ అద్భుతాన్ని చూసేందుకు దేశవిదేశాల నుంచి పర్యాటకులు తరలివస్తారు. 2022లో ఇక్కడి పర్యాటకుల సంఖ్య 44 శాతం పెరిగిందనీ.. 2023లో 51 శాతం వృద్ధి నమోదైందని యూఏఈ అధికారులు తెలిపారు. 2030 కల్లా దేశంలో 30 లక్షల మంది వార్షిక పర్యాటకులను రప్పించేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com