POK : పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో హింసకు కారణాలివే
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై పాక్ సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. ముజఫరాబాద్‌లో అధిక గోధుమ పిండి ధరలు, విద్యుత్ ఛార్జీలపై ఆందోళన చేస్తున్న ప్రజలపై భద్రతా దళాలు కాల్పులు జరిపి.. ముగ్గురి ప్రాణాలను బలిగొన్నాయి. ఈ ఘటనలో మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఆందోళనలకు కారణాలేంటో తెలుసా..
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో హింస చల్లారడం లేదు. తాజాగా ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న నిరసనకారులపై పాక్ భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ముగ్గురు ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోగా ఆరుగురికి గాయాలయ్యాయి. శనివారం జరిగిన అల్లర్లలో ఒక పోలీసు అధికారి సహా మరికొందరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. శనివారం ఆందోళనకారులను అదుపు చేయడానికి భద్రతా దళాలు ఒక దశలో ఏకే-47తో కాల్పులు జరపాల్సి వచ్చింది. తక్షణమే ఇక్కడి పరిస్థితిని అదుపు చేయడానికి ప్రభుత్వం 2వేల 300 కోట్ల రూపాయిలను విడుదల చేసినా పరిస్థితి అదుపులోకి రావడంలేదు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో వ్యాపారాలు పూర్తిగా మూతపడ్డాయి.
స్థానిక మంగ్లా డ్యామ్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ఉచితంగా ఇవ్వాలని స్థానికులు బలంగా డిమాండ్ చేస్తున్నారు. అంతేకాక గోధుమలపై రాయితీలు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ ప్రాంతంలో ద్రవ్యోల్బణం అత్యంత తీవ్ర స్థాయికి చేరింది. ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఫలితంగా స్థానిక ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేశారు. వీటిని అడ్డుకునేందుకు ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. స్థానికులు ఆహార ధాన్యాలను పండించుకునే మీర్పుర్ జిల్లాలోని అత్యంత సారవంతమైన భూములను తీసుకొని 1967లో జీలం నదిపై మంగ్లా ఆనకట్టను నిర్మించారు. అక్కడ భారీ హైడ్రోపవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. డ్యామ్‌లో మొత్తం 1400 మెగావాట్ల విద్యుత్తు తయారవుతుండగా.. వీటిల్లో 300 మెగావాట్లను స్థానికంగా ఇస్తామని నాడు పాక్ స్థానికులకు హామీ ఇచ్చింది.
ఆ హామీని పాకిస్తాన్ విస్మరించిందన్న విమర్శలు ఉన్నాయి. ఉత్పత్తి చేసిన విద్యుత్తును పంజాబ్ ప్రాంతానికి తరలించుకుంటోంది. పంజాబ్ వాసులతో పోలిస్తే స్థానిక ప్రజలకు ప్రతి యూనిట్‌పై అధిక ధరను వడ్డించడం గమనార్హం. పీవోకేలోని సహజ సంపదనూ పాకిస్థాన్ ప్రభుత్వం దోపిడి చేస్తోంది. పీవోకేలో ఏటా 20 లక్షల వృక్షాలను నరికి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిసింది. ఫలితంగా స్థానికంగా మట్టిపెళ్లలు విరిగిపడటం, వరదలు వంటి ప్రకృతివైపరీత్యాలు పెరిగాయి. ఈ ప్రాంతంలో ఏటా 300 కోట్ల పాకిస్థానీ రూపాయలకు సరిపడా పువ్వులు, వన మూలికలను పండిస్తారు. వీటిని పాక్ కార్పొరేన్లు విక్రయించుకొని సొమ్ము చేసుకొంటున్నాయి. స్థానిక ప్రభుత్వానికి ఇచ్చే నిధులపై ఎటువంటి రికార్డులు లేవు. ఇక నీలం లోయలో అమూల్యమైన రత్నాలను వెలికి పాకిస్థాన్ ప్రభుత్వమే విక్రయించుకుంటోంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో మంచినీటి వ్యవస్థలను కూడా ఇస్లామాబాద్ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. మురికినీరు తాగి వేలమంది ఆస్పత్రి పాలవుతున్నారు. తమ ప్రాంతాల్లోని సంపదను దోచుకుని ఇతర ప్రాంతాల వారికి ఇస్తుండటం, ఉద్యోగాలు, వేతనాల విషయంలోనూ తమపై వివక్ష చూపిస్తుండటంతో.. పీవోకే ప్రజలు విసిగిపోయారు. ఈ క్రమంలో తరచూ పాక్ పాలకులపై తిరుగుబాట్లు చేస్తున్నారు. తాము పాకిస్థాన్ నియంత్రణలో ఉండబోమనీ.. భారత్‌తో కలిసిపోతామన్న డిమాండ్లు కూడా అక్కడ వినిపించడం సర్వ సాధారణం
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com