అగ్రరాజ్యం అమెరికాను ముంచేస్తోన్న మంచు తుఫాను

అగ్రరాజ్యం అమెరికాను ముంచేస్తోన్న మంచు తుఫాను
టెక్సాస్‌లో మైన‌స్ 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది.

అగ్రరాజ్యం అమెరికాను మంచు ముంచేస్తోంది.. మంచు తుఫాను ధాటికి జనజీవనం అస్తవ్యస్తమైంది.. మంచు, చలిగాలులకు పలు రాష్ట్రాలు వణికిపోతున్నాయి.. టెక్సాస్‌తో పాటు ద‌క్షిణాది రాష్ట్రాల్లో మైనస్ డిగ్రీల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా తీవ్రమైన చ‌లిగాలులు వీస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో విపరీతంగా మంచు కురుస్తోంది.

ఇక టెక్సాస్‌లో ప‌రిస్థితి అత్యంత భయానకంగా మారింది. గ‌త 30 ఏళ్లలో ఎన్నడూ చూడ‌ని విధంగా మంచు తుఫాను విరుచుకుపడుతోంది.. టెక్సాస్‌లో మైన‌స్ 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. విద్యుత్‌ ప్లాంట్ల యంత్రాలు మంచుతో గడ్డకట్టిపోయాయి.. దీంతో నగరమంతా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఈరోజు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా 10 కోట్ల మందిపై మంచు తుఫాను ప్రభావం చూపించగా.. ఒక్క టెక్సాస్‌లోనే 28 లక్షల మంది విద్యుత్‌ లేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆ రాష్ట్రంలో ఎమ‌ర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో విద్యుత్‌కు ఎక్కువ డిమాండ్ ఏర్పడటంతో అక్కడ ప‌వ‌ర్ క‌ట్స్ మొద‌ల‌య్యాయి. విద్యుత్‌, నీటి సరఫరా లేక కనీస అవసరాలు తీర్చుకునేందుకు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

మంచు తుఫాన్ మ‌రోసారి విరుచుకుప‌డే అవ‌కాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 15 కోట్ల మంది అమెరిక‌న్లకు వింట‌ర్ స్ట్రామ్ హెచ్చరిక చేశారు. తీవ్రమైన మంచు తుఫాన్ వ‌ల్ల ఇప్పటి వ‌ర‌కు 11 మంది మృతిచెందారు. టెన్నిసి, టెక్సాస్‌, కెంట‌కీ, లూసియానాల్లో ఈ మ‌ర‌ణాలు సంభ‌వించాయి. నార్త్ క‌రోలినాలో టోర్న‌డో బీభ‌త్సం సృష్టించింది. దాని వ‌ల్ల ముగ్గురు మృతిచెందగా 10 మంది గాయ‌ప‌డ్డారు. అక్కడ సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

అమెరికాలో సుమారు 73 శాతం మంచు గుప్పిట్లోకి వెళ్లినట్టు నేష‌న‌ల్ వెద‌ర్ స‌ర్వీస్ పేర్కొంది. మెక్సికోలోని ఉత్తరాది, మ‌ధ్య ప్రాంతాల‌కూ అతిశీత‌ల తుఫాన్ చేరుకుంది. దీంతో అక్కడ కూడా వరుసగా రెండో రోజు విద్యుత్తు స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. పైప్‌లైన్లు గడ్డకట్టడంతో.. స‌హ‌జ‌వాయువు స‌ర‌ఫ‌రా ఆగిపోయింది. గత కొన్ని రోజులుగా విపరీతంగా మంచు కురస్తుండటంతో రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రోడ్లపై మంచువల్ల ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి.

Read MoreRead Less
Next Story