James Webb telescope: జేమ్స్‌వెబ్ టెలిస్కోప్ తీసిన అద్భుత చిత్రాలు

విశ్వం గుట్టు విప్పేందుకు అంతరిక్షంలోకి దూసుకెళ్లిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు తన రెండేళ్ల ఖగోళ ప్రయాణంలో ఎన్నో అత్యద్భుతమైన చిత్రాలను కెమెరాల్లో బంధించింది.ఇప్పటికే 13 వందల కోట్ల ఏళ్ల క్రితం, విశ్వం పుట్టుక ప్రారంభం నాటి అరుదైన చిత్రాన్ని సైతం నాసాతో పంచుకున్న ఈ టెలిస్కోపు.. కంటితో చూడలేని, ఊహకు కూడా అందని మరెన్నో అరుదైన దృశ్యాలను మానవాళికి అందించింది.
విశ్వంపుట్టుక, నక్షత్రాల ఆవిర్భావం రహస్యాలను ఛేదించేందుకు మానవ చరిత్రలో ప్రయోగించిన అతి శక్తిమంతమైన టెలిస్కోపు జేమ్స్‌వెబ్ తన ఖగోళ ప్రయాణంలో రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు మానవాళి విశ్వాంతరాల్లో చూడలేని ఎన్నో అరుదైన ఫొటోలను జేమ్స్‌వెబ్ నాసాతో పంచుకుంది. వాటిలో 13 వందల కోట్ల క్రితం విశ్వం ప్రారంభమైన నాటి అత్యంత స్పష్టమైన,. అంతరిక్షంలో మనిషి చూడని అతి సుదూరమైన దృశ్యాన్ని గతంలోనే అందించిన జేమ్స్‌వెబ్.. మరెన్నో దృశ్యాలను విడుదల చేసింది.
జేమ్స్‌వెబ్ తీసిన చిత్రాల్లో భూమికి 15 కాంతి సంవత్సరాల దూరంలోని విచ్ఛిన్నమైన నక్షత్రం ఔరా అనిపించింది. ఈ ప్రదేశాన్ని కాసియోపియా ఎ అని అంటారు. అలాగే 630 కాంతి సంవత్సరాల దూరంలోని చమలీన్ అనే పరమాణు మేఘాన్ని జేమ్స్‌వెబ్ ఫొటో తీసి పంపింది. పాలపుంతలోని నక్షత్రాలు తయారవుతున్న 3 కృష్ణబిలాలున్న సాగిటారస్ సి ప్రాంతాన్ని, 50 వేళ్ల క్రితమే పుట్టిన చిన్న నక్షత్రం HH 212 చిత్రాన్ని అందించింది. జేమ్స్ వెబ్ విడుదల చేసిన ఫొటోల్లో M51 వర్పూల్ గెలాక్సీ ఆకట్టుకుంది. అలాగే 50 కోట్ల ఏళ్ల క్రితం రెండు గెలాక్సీలు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోగా ఏర్పడిన ఎన్జీసీ 3256చిత్రాన్ని టెలిస్కోపు పంపింది. వీటితో పాటు క్రాబ్ నెబ్యులా, ఓరియన్ నెబ్యులా, శని, గురు గ్రహాలకు సంబంధించిన అరుదైన ఫొటోలను భూమికి పంపించింది.
విశ్వం గుట్టు ఛేదించేందుకు అమెరికా, ఐరోపా, కెనడా అంతరిక్ష సంస్థలు సంయుక్తంగా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపును రూపొందించాయి. 2021 డిసెంబర్ 25న ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించారు. ఎరియాన్-5 అనే భారీ రాకెట్ దీన్ని నింగిలోకి తీసుకెళ్లింది. దీని జీవిత కాలం 10 సంవత్సరాలుగా నిర్ణయించారు. అయితే 20 ఏళ్లు పనిచేయగలుగుతుందని నాసా చెబుతోంది. ప్రస్తుతం ఇది భూమికి 160 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు తెలిపింది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com