Pakistan: అఫ్గాన్లను వెతికి మరీ తరిమేస్తున్న పాక్

17 లక్షల మంది అఫ్గానిస్తాన్ పౌరులను తమ దేశం నుంచి నిర్దాక్షిణ్యంగా తరిమివేస్తున్న పాకిస్తాన్.. వారి కోసం అణువణువునా జల్లెడపడుతోంది. ఇప్పటికే 3 లక్షల మంది అఫ్గాన్ పౌరులు దిక్కుతోచని స్థితిలో కట్టుబట్టలతో పాకిస్తాన్‌ను వీడగా...మిగిలిన వారి కోసం పాక్ అధికారులు ఇంటింటికీ వెళ్లి వెతుకుతున్నారు. డాక్యుమెంటేషన్ సరిగా లేని వారందరినీ అదుపులోకి తీసుకుని డిటెన్షన్ కేంద్రాలకు తరలిస్తున్నారు.
పాకిస్థాన్‌లోని అఫ్గాన్ శరణార్థులను ఆ దేశ ప్రభుత్వం తరిమేస్తోంది. ఇందుకోసం భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించి తనిఖీలను నిర్వహించి అక్రమంగా వచ్చిన వారిని అదుపులోకి తీసుకుంటోంది. కరాచీతో సహా చాలా ప్రదేశాల్లో శరణార్థుల కోసం ముఖ్యంగా అఫ్గాన్ల కోసం పాక్ పోలీసులు జల్లెడ పడుతున్నారు. కరాచీలో 50 మంది అఫ్గాన్లను అదుపులోకి తీసుకున్నారు.
తమ దేశంలో సరైన అనుమతులు లేకుండా ఉంటున్న వారినే వెళ్లిపోవాలని చెబుతున్నామని పాక్ ప్రభుత్వం తెలిపింది. అఫ్గాన్లను తరిమేసేందుకు సరిహద్దుల్లో 3 క్రాసింగ్‌లను పాక్ తెరిచింది. పాక్ పోలీసులు అరెస్టు చేసి డిటెన్షన్ కేంద్రాల్లో పెడుతుండటంతో భయపడుతున్న అఫ్గాన్లు.. తట్టాబుట్ట సర్దుకుని పిల్లలతో సహా సొంత దేశం వైపు అడుగులు వేస్తున్నారు. పాక్‌లో 17 లక్షల మంది అఫ్గాన్ శరణార్థులు ఉండగా ఇప్పటి వరకు 3 లక్షల మంది ఆ దేశాన్ని వీడినట్లు తెలిసింది.
ఇలా పాక్‌ను విడిచి వెళుతున్న అఫ్గాన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి వివరాలను తాలిబన్ ప్రభుత్వం రిజిస్టర్ చేసేందుకు చాలా సమయం తీసుకుండటంతో వారంతా సరిహద్దుల వద్దే టెంట్లు వేసుకుని ఉండిపోవాల్సి వస్తోంది. హిమాలయాలకు దగ్గరగా ఉండటం, ఆపై.. చలికాలం కావడంతో వారంతా నరకం చూస్తున్నారు. తమ వెంట చిన్న పిల్లలు ఉన్నారనీ.. తాము వెళ్లిపోయేందుకు పాక్ ప్రభుత్వం కొన్ని నెలల గడువు ఇవ్వాలని వారంతా కోరుతున్నారు. పాక్ ఇలా నిర్దాక్షిణ్యంగా అఫ్గాన్ పౌరులను తమ దేశం నుంచి వెళ్లగొడుతుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com